21 March, 2026 | 11:18 PM

అంకిత హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు

31-05-2025 12:47 AM

2022 సెప్టెంబర్‌లో దారుణహత్యకు గురైన రిసెప్షనిస్ట్

డెహ్రాడూన్: మూడేళ్ల కిత్రం సంచలనం రేపిన రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ఉత్తరాఖండ్ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో పులకిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఎట్టకేలకు శిక్షను ఖరారు చేసింది. కేసులో సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులపై నమోదైన అభియోగాలు నిజమని నిర్ధారణకు వచ్చిన కోట్‌ద్వార్‌లోని ‘ది అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు’ దోషులకు జీవితఖైదుతో పాటు 50వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి జిల్లాకు చెందిన 19 ఏళ్ల అంకితా భండారి రిషికేశ్‌లోని వనంత్ర రిసార్టులో రిసెప్షనిస్టుగా విధులు నిర్వర్తించేది. సెప్టెంబర్ 18న ఆమె హత్యకు గురవ్వగా.. సెప్టెంబర్ 24న చిల్లా కెనాల్‌లో మృతదేహం లభ్యం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయాన్ని ఎక్కడ బయటపెడుతుందోనని పులకిత్, సౌరభ్, అంకిత్ గుప్తాలు హత్య చేసి చిల్లా కెనాల్‌లో తోసేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.