19 August, 2026 | 2:42 AM

ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకెళ్లిన తూము రవీందర్ పటేల్

19-08-2026 12:09 AM

పెద్దపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి సమావేశంలో పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల తరఫున జిల్లా కన్వీనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్రస్థాయిలో సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధులు కోరారు.

ఈ సమావేశానికి రాష్ట్ర తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి చైర్మన్ జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ ఫోరముల అధ్యక్షులు, అన్ని జిల్లాల చైర్మన్లు, కన్వీనర్లు, జంట నగరాల ఉద్యోగుల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జిల్లాల వారీగా సమస్యలను సేకరించి, వాటి పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.