13-02-2026 01:02:55 AM
నిబంధనలు కచ్చితంగా పాటించాలి: కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టణంలోని టీటీడీసీ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, తదితర సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం నాలుగు హాళ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పా రు. 49 వార్డులకు గాను ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్ చొప్పున 49 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో సుమారు 180 మంది శిక్షణ పొందిన సిబ్బంది విధులు నిర్వహించనున్నారని తెలిపారు.
ఒక్కో టేబుల్ వద్ద మూడు రౌండ్ల లెక్కింపు ఉండగా, ప్రతి రౌండ్కు సుమారు 90 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని, వేగం కంటే ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటలలో పు ఫలితాలు వెల్లడయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ మాట్లాడుతూ... పోలింగ్ను విజయవంతంగా నిర్వహించినట్లే కౌంటింగ్ను సైతం క్రమశిక్షణతో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించా రు. కౌంటింగ్ కేంద్రం వద్ద సిబ్బంది, ఏజెంట్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అధికారులు రాథోడ్ రవీందర్, రమేష్, ఫణిందర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.