1 April, 2026 | 2:34 AM

సలేశ్వరం జాతరకు పటిష్ట బందోబస్తు

01-04-2026 12:00 AM

- 326 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత :

- జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్ మార్చి 31 ( విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా జరిగే సలేశ్వరం జాతర సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అచ్చంపేటలో నిర్వహించిన పోలీస్ బ్రీఫింగ్లో వివరాలు వెల్లడించారు. జాతర సందర్భంగా మొత్తం 326 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

భక్తులు ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు మాత్రమే సలేశ్వరం స్వామిని దర్శించుకునేందుకు అవకాశం ఉందన్నారు. నల్లమల్ల అటవీ లోతట్టు ప్రాంతంలో దేవుడు కొలువుదీరి ఉన్నందున భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, రాత్రి సమయంలో కాకుండా పగలు వేళలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. అడవిలో ప్రయాణం ఎక్కువగా ఉండటంతో భక్తులు తమ వెంట నీటి సీసాలు తీసుకెళ్లాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, అచ్చంపేట సీఐ నాగరాజు, అచ్చంపేట సబ్ డివిజన్కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు.