09-12-2025 12:00:00 AM
శంకర్ పల్లి డిసెంబర్ 08: మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీఐ వీరబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు మరియు వారి తరఫున ప్రచారం చేసే కార్యకర్తలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉందని సీఐ వీరబాబు తెలిపారు. ఈ సమయ పరిమితిని దాటించి ప్రచారం నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాత్రి వేళలలో మైక్ వినియోగం, ర్యాలీలు, రోడ్ షోలు వంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. వాహనాలకు బ్యానర్స్ కట్టి ప్రచారం చేయాలనుకుంటే ముందుగానే ఎంపీడీఓ దగ్గర అనుమతి తీసుకోవాలని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
ఈ తరహా చర్యలకు పాల్పడితే అభ్యర్థులతో పాటు వారి అనుచరులపై కూడా కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని సీఐ వీరబాబు విజ్ఞప్తి చేశారు. ఏవైనా అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికలను శాంతియుతంగా, నిబంధనల మేరకు నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై పార్టీ, హోదా ఏదైనా సరే కఠిన చర్యలు తప్పవని సీఐ వీరబాబు మరోసారి హెచ్చరించారు.