18 March, 2026 | 5:24 PM

ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు

09-12-2025 12:00 AM
  1. ర్యాండమైజేషన్ ద్వారా విధుల కేటాయింపు
  2. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

రంగారెడ్డి, డిసెంబర్ 8(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజర్ సిబ్బంది పై కఠిన చర్యలు చేపడతామని జిల్లా  పంచాయతీ ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బందికి విధులకు కేటాయింపు కోసం  మూడవ  విడత లో రెండవ ర్యాండమైజెషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్  సి.నారాయణ రెడ్డి  సమక్షంలో  పూర్తి చేశారు.

అనంతరం జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  మరియు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ మూడవ విడతలో రెండవ  ర్యాండమైజెషన్ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఎన్నికల విధులు నిర్వర్తించే 4458 ప్రిసైడింగ్, అధికారులను, ఇతర అధికారులతో కూడిన బృందాలను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు.

వీరికి ఇప్పటికే మొదటి విడత శిక్షణను ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. రెండవ విడత మండలాలలో పోలింగ్ సిబ్బందికి తేదీ: 9-12-2025న వారికి కేటాయించిన మండల కేంద్రాలలో రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్,(లోకల్ బాడీస్) డీపిఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.