బెంగాల్‌లో TMC కార్యాలయాలు ధ్వంసం
కోల్‌కతా: రాష్ట్రంలో తమ ఘన విజయాన్ని బీజేపీ కార్యకర్తలు సంబరంగా జరుపుకుంటున్న వేళ పశ్చిమ బెంగాల్(West Bengal) వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాలపై దహనకాండ, విధ్వంసకర ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి టోలీగంజ్, బరుయిపూర్, కమర్‌హటి, బరనగర్, బహరంపూర్, హౌరా, కాస్బాల్లోని టీఎంసీ కార్యాలయాలను అదుపుతప్పి వచ్చిన గుంపులు ధ్వంసం చేశాయని పోలీసులు తెలిపారు. టాలీగంజ్‌లోని బిజోయ్‌గఢ్-నేతాజీనగర్ ప్రాంతంలో, TMC అభ్యర్థి, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్‌కు చెందిన ఎన్నికల కార్యాలయాన్ని ఒక మూక ధ్వంసం చేయడం కనిపించింది.
ఆ గుంపులోని కొందరు, అక్కడి నుండి వెళ్లిపోయే ముందు, విరిగిపోయిన హోర్డింగ్‌ను తన్నడం కనిపించింది. రూబీ క్రాసింగ్ వద్ద, బీజేపీ జెండాలు చేతబట్టిన ఒక గుంపు TMC కౌన్సిలర్ సుశాంత ఘోష్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలను టీఎంసీ ఖండించింది. "అధికారంలోకి వచ్చిన వెంటనే BJP తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ముర్షిదాబాద్‌లోని మా పార్టీ కార్యాలయంపై వారి గూండాలు హింసాత్మక దాడికి పాల్పడ్డారు. విధ్వంసం, అరాచకం ఇదే బీజేపీ అసలు స్వరూపం. ఇది బీజేపీ దిగజారిపోయిన 'గట్టర్ రాజకీయాలకు' నిదర్శనం," అంటూ TMC ఎక్స్ లో పోస్టు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఆఫీసులు ధ్వంసం ఘటనల్లో తమ ప్రమేయం లేదని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.






