మన ప్రాధాన్యం కొనసాగాలంటే?
నిర్ధనం పురుషం వేశ్యాం,
ప్రజా భగ్నం నృపాం త్యజేత్,
ఖగాః వీత ఫలం వృక్షం,
భుక్త్వా చాభాగతో గృహమ్!
చాణక్య నీతి (2-17)
వస్తువుల వినియోగానంతరం, అవి నిరుపయోగం అనిపిస్తే వాటిని విడిచి వేస్తాం. అలాగే, ఎంతగా బంధాన్ని పెంచుకున్నా కొన్నింటిని విడవడం లోకంలో కన్పిస్తుంది. వాటిని ప్రస్తావిస్తున్నాడు చాణక్యుడు. విటుడు, పొట్టివాడు, నడ్డిముక్కు, బానకడుపు, గారపండ్లు కలిగి కురూపియైన వానివద్ద డబ్బు ఉంటే నీవే మన్మధుడవని వేశ్య ఆదరిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నానని వగలు పోతుంది. అదే వ్యక్తి సంపద పోగొట్టుకొని నిర్ధనుడైతే అతను నిజంగా మన్మధుడైనా వేశ్య అతనిపట్ల విముఖత ప్రదర్శిస్తుంది. అతడిని విడిచి వేస్తుంది. ఒక రాజు ఆర్థికంగా, సైనికపరంగా బలవంతుడు, శక్తివంతుడూ అయితే సామంతులు అతనిని గౌరవిస్తారు. ప్రజలు అభిమానిస్తారు. అదే రాజు ఆర్థికంగా చితికి పోయి బలహీనుడై గౌరవ మర్యాదలు కోల్పోతే, సామంతులే కాదు తన ప్రజలు సైతం అతనిని వదలివేస్తారు. అడవిలో బాగా పుష్పించి ఫలాదులతో కళకళలాడుతున్న చెట్టుపైకి పక్షులు చేర తాయి. అక్కడ ఆనందం, సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. అదే చెట్టు ఫలపుష్పాలకు దూరమై మోడు వారితే పక్షులు ఆ చెట్టు ను విడిచి మరోచోటుకు చేరుతాయి. అలాగే, విందు భోజనానికి ఆహ్వానితులైన అతిథులు చాలా సంతోషంగా యజమాని గృహాన్ని చేరుకుంటారు. కోలాహలాన్ని సృష్టిస్తారు. ఆనందాన్ని పంచుకుంటారు. భోజనానంతరం, ఆ ఇంటిని విడిచిపెట్టి మరోచోటికి వెళతారు. ఉపయోగపడేంత వరకే ఏ వస్తువుకైనా విలువ ఉంటుంది. ఒకసారి అది నిరుపయోగం అనిపిస్తే అది ఎంత గొప్పదైనా పనికిరానిదవుతుంది.
విలువ తగ్గరాదు
మనిషి జీవితమూ ఇందుకు భిన్నం కాదు. మన అవసరం ఇతరులకు ఉన్నంత వరకే మనకు గౌరవం. మనల్ని గుర్తిస్తారు. వారు నిరంతరం మనపై ఆధారపడి వుండేలా చేసుకొనే కళను అభ్యసించగలగాలి. దీనివల్ల మన అస్తిత్వానికి రక్షణ లభిస్తుంది. మనం నీతిగా, నిజాయతీగా ప్రవర్తించడం వల్ల గౌరవమూ పెరుగుతుంది, ప్రయోజనం ఉంటుంది. కాని, దానికన్నా ఇతరులు మనపై ఆధారపడితే మనకెక్కువ లాభం ఉంటుంది. దాహంతో ఉన్న వ్యక్తికి బావి అవసరం ఉంటుంది. ఎంత దూరమైనా ఓరిమితో నడుస్తాడు, అన్వేషిస్తాడు, సాధిస్తాడు, సంతోషిస్తాడు. కానీ, దాహం తీరాక, ఆ బావితో అవసరం తీరాక, దానిపై ఆధారపడడం తగ్గిపోతుంది. మరో ప్రత్యామ్నాయం లభిస్తే ఎన్నో ఏండ్లుగా తన దాహార్తిని తీర్చిన బావియైనా సరే, దానిపై మన్నన, మర్యాద తగ్గిపోతాయి. దానిని అనాదరణం చేస్తాడు. చిన్నప్పుడు ఒక కథ విన్నాం. ఒక మల్లయోధుడు శిష్యులకు యుద్ధవిద్య నేర్పిస్తున్నాడు. అందరిలో చురుకైన ఒక శిష్యునికి యుద్ధ విద్యలన్నింటిలో నిష్ణాతుడయ్యేలా శిక్షణ నిచ్చాడు. శిష్యునిలో అహంకారం పొడసూపింది. గురువునే తనతో యుద్ధం చేసి గెలవమని సవాలు చేశాడు. తప్పని పరిస్థితులలో గురువు ఒప్పుకున్నాడు.
కొద్ది సమయంలోనే గురువు శిష్యునికి తెలియని పట్టుతో శిష్యుని ఓడించాడు. ‘ఈ విద్య ఎందుకు నాకు నేర్పలేదు?’ అని శిష్యుడు అడిగాడు. ‘అన్ని విద్యలూ నీకు నేర్పిస్తే నాపై నీకు గౌరవం తగ్గిపోతుంది. అహంకారం తలకెక్కితే నన్నే సవాలు చేస్తావు. నా రక్షణ, గౌరవాన్ని గురించి కూడా నేను ఆలోచించాలి కదా! అందుకే నీ వైఖరి, అర్హతల ప్రాతిపదికగా విద్యను అందించడం జరిగింది’ చెప్తాడు. దాంతో శిష్యుని గర్వం సమసి పోవడమేకాక జీవితాంతం గురువుపై ఆధారపడి ఉన్నాడు. దాదాపుగా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు చాణక్యుడు. మన అవసరం తీరితే మనమెంత గొప్పవారమైనా పక్కన పెడతారు. ఆరబోసిన అందాలకన్నా, మరుగున ఉన్న అందాలకే విలువ ఎక్కువ. ఏం చేసినా, మన అవసరం ఎదుటి వారికి ఉండేట్లుగా చూడడం, మనకు విషయం తెలుసునన్నట్లుగా ప్రవర్తించడం, మనం లేకపోతే పనులు జరగవన్నట్లుగా పరిస్థితులను చూపెట్టడం నేర్చిన వారి ప్రాధాన్యం ఎప్పుడూ తగ్గదు.
పాలకుర్తి రామమూర్తి






