ఆక్రమిత కశ్మీర్‌లో అంతర్యుద్ధం
విదేశీ సాయంపై ఆధారపడ్డ వ్యవస్థ
పాక్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా విదేశీ సహాయంపై ఆధారపడింది కావడమే సమస్యలన్నింటికీ ప్రధాన కారణం. గతంలో అమెరికాకు పాక్ బలమైన మిత్రదేశంగా ఉండడంతో అగ్రరాజ్యం నుంచి నిధులు పుష్కలంగా లభించేవి. అలాగే ఇస్లామిక్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా కూడా ఆ దేశానికి బాగానే సాయం అందించేవి. కానీ, ఇటీవలి కాలంలో పాక్ ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తుండడం, మరోవైపు అంతర్జాతీయంగా భారత్ బలపడడం వంటి కారణాలతో ఇంతకాలం పాక్‌కు సాయం అందిస్తూ వచ్చిన దేశాలు ఇప్పుడు దూరమయ్యాయి. దీనికితోడు కరోనా, ఆకస్మిక వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా పాక్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ఇప్పుడు ఆ దేశం దాదాపు ఒంటరిగా మారిపోయింది. ఒక్క చైనా మాత్రమే ఆ దేశాన్ని ఆదుకుంటోంది. అయితే, ప్రతిఫలం లేకుండా ‘డ్రాగన్’ ఏ సహాయమూ చేయదనేది అందరికీ తెలిసిందే. మారిన రాజకీయ పరిస్థితుల్లో పాక్ అలాంటి సాయం చేసే అవకాశం ఉందా? అనేదే ప్రశ్న. అలా కాని పక్షంలో పాక్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.
గత రెండేళ్లుగా మన పొరుగు దేశమైన పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న విష యం తెలిసిందే. విదేశీ ద్రవ్యనిల్వలు అడుగంటడంతో ముడిచమురు లాంటివి విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు నిధులు లేక అల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెట్రోలు, డీజిలు ధరలు ఆకాశాన్ని అంటాయి దాంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొండెక్కాయి. గోధుమపిండి వంటి సరకులకు కూడా రేషన్ పెట్టాల్సి వచ్చింది. ఈ పరిస్థితి క్రమంగా వ్యాపార వర్గాల్లో, సామాన్య ప్రజల్లో అశాంతికి కారణమవుతూ వచ్చింది. ఈ అశాంతి ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతంలో నిరసన ప్రర్శనలకు దారితీసింది. భారత్‌తో వ్యాపారం ఆగిపోవడం కూడా వ్యాపారుల ఆందోళనకు తోడయింది. ఫలితంగా గత నాలుగు రోజలుగా పీఓకేలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. గత శుక్రవారం పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో వ్యాపారులు, ప్రజలు బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రజా రవాణాసహా వ్యాపార సంస్థలు, మార్కెట్లు అన్నీ మూతపడ్డాయి. ఆందోళనకారులు ఓ పోలీసుపై మూకదాడి చేసి చంపేశారు. పలువురు పోలీసులు గాయపడ్డారు కూడా. పరిస్థితి చేయి జారడాన్ని గమనించిన పాక్ ప్రభుత్వం ఆదివారం నాడు శాసనసభ, కోర్టు భవనాలు లాంటి వాటికి భద్రత కల్పించడానికి పారామిలిటరీ అయిన రేంజర్స్ బలగాలను రంగంలోకి దింపింది.
అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పుర్, ముజఫరాబాద్‌లలో ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శనివారం ఒక దశలో ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతాదళాలు ఏకే 47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి పాక్ ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్థానీ రూపాయలను విడుదల చేసినా ప్రజలు శాంతించడం లేదు. తమకు న్యాయంగా దక్కాల్సిన నిధులు రావడం లేదనేది స్థానిక ప్రజల ప్రధాన అసంతృప్తిగా ఉంది. ప్రధానంగా స్థానిక మంగ్లా డ్యామ్‌నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తమకు ఉచితంగా ఇవ్వాలని ఇక్కడి ప్రజలు గట్టిగా కోరుతున్నారు. అలాగే, ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమలపై రాయితీలు కల్పించాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్రస్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 20 శాతం ఉంటే, ఇక్కడ 30 శాతం దాకా ఉంది. ఫలితంగా అన్ని వస్తువుల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.
మంగ్లాడ్యామ్‌లో దోపిడీ
1967లో జీలం నదిపై మంగ్లాడ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ భారీ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. 1975 నాటికే డ్యామ్ నిర్మాణ ఖర్చులు ప్రభుత్వానికి వచ్చేశాయి. ఒక్క 2010లోనే ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తాన్ని పాక్ ప్రభుత్వమే తీసుకుంటుంది. పీఓకేలోని స్థానిక ప్రభుత్వానికి ఒక్క పైసా ఇవ్వలేదు. మీర్పుర్ జిల్లాలో అత్యంత సారవంతమైన భూములను తీసుకుని ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ భూముల్లో స్థానికులు ఆహార ధాన్యాలను పండించేవారు. డ్యామ్ లో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా ఇందులో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని అప్ప ట్లో పాక్ ఇక్కడి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ, ఇక్కడి నుంచి పాక్ పంజాబ్‌లోకి విద్యుత్‌ను తరలించడం మొదలు పెట్టింది. వాస్తవానికి అక్కడి పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సి రావడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది.
అదే కాకుండా, పీఓకేలో ప్రతి ఏటా 20 లక్షల వృక్షాలను నరికి వేసి పాకిస్థాన్‌కు తరలించి విక్రయిస్తున్నారని పరిశోధకుడు డాక్టర్ షబ్బీర్ చౌద్రీ అంటున్నారు. ఫలితంగా స్థానికంగా మట్టిపెళ్లలు విరిగిపడటం, అకాల వరదలు రావడం వంటి విపత్తులు పెరిగాయి. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థ్థానీ రూపాయల విలువైన పూలు, మూలికలు పండిస్తారు. వీటిని పాక్ కార్పొరేషన్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక, నీలం లోయలో విలువైన వజ్రాలు లభిస్తాయి. ఇక్కడి నుంచి దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువైన వజ్రాలను పాక్ ఇప్పటిదాకా వెలికి తీసి విక్రయించుకుంది. ఈ ప్రాంతాన్ని ఇంతగా దోచుకున్న పాక్ ప్రభుత్వం స్థానికంగా తాగునీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. మురికి నీరు తాగడం వల్ల ఏటా వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.
భారత్‌లో విలీనానికి డిమాండ్
ఈ ఆగడాలకు విసిగిపోయిన స్థానికులు తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తమ ప్రాంతాన్ని భారత్‌తో విలీనం చేయాలన్న డిమాండ్ సైతం బలంగా వినిపిస్తోంది. నిరాయుధులైన ప్రజలపై పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని పీఓకేలో ఉద్యమకారుడు అంజాద్ అయూబ్ మీర్జా ఇటీవల ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు పెంచడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్న తన డిమాండ్‌ను పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా ఆయన ఆరోపించారు. ‘ఇక్కడి పరిస్థితి చేజారి పోయింది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఆయనే కాదు, ఇతర వర్గాల నుంచి కూడా కొంత కాలంగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే భారత్‌తో శత్రుత్వాన్ని విడనాడి స్నేహహస్తం చాచాలని వ్యాపార వేత్తలు ప్రధానికి గట్టిగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్‌ఖాన్‌తో ఘర్షణ వైఖరికి స్వస్తి చెప్పి ఆయనతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించాలని కూడా వారు సూచించినట్లు తెలుస్తున్నది.






