భగీరథ ప్రయత్నంతో కార్యసాధన
నేడు సగర భగీరథ మహర్షి జయంతి
భగీరథుని వంశానికి చెందినవారిని నేటి సమాజంలో సగర వంశీయులు లేదా భగీరథుని వారసులుగా పిలుస్తున్నారు. గొప్ప చరిత్ర, ఘనమైన వైభ వం కలిగిన సగర వంశీయుల జీవన విధానం కాలక్రమేణా పూర్తిగా మారిపోయింది. సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర వంశీయుల ఘన చరిత్రను మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేడు ఈ వంశానికి చెందిన చాలామంది నిర్మాణ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం, బావుల తవ్వకం, ఆనకట్టలు నిర్మించడం లాంటి నిర్మాణ పనులు వీరు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల అభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిది. సమాజ అభివృద్ధికి నిశ్శబ్దంగా సేవలు అందిస్తున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఈ వర్గం చాలా వెనుకబడి ఉంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు శ్రీభగీరథ జయంతి ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భగీరథుని చరిత్రను తెలియజేసే సభలు నిర్వహిస్తారు. కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ సగర వంశీయులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లోనూ ఈ జయంతిని ఘనంగా జరుపుకొంటు న్నారు. భగీరథుని వంశమే తరువాత కాలంలో మరింత మహిమాన్వితమై, అదే సూర్యవంశంలో శ్రీరాముడు అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది ఈ వంశం గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
అయితే, భగీరథ జయంతి సందర్భంలో ఆయన చేసిన తపస్సు, గంగావతరణం వంటి మహోన్నత కార్యాలను ప్రధానంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గంగానది భూమిపై అవతరించిన గాథ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ మహత్తర కార్యానికి కారణమైన మహానుభావుడు సూర్యవంశానికి చెందిన శ్రీభగీరథుడే. ఆయన చేసిన దీర్ఘకాల తపస్సు, పితృభక్తి నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సూర్యవంశ మూలం బ్రహ్మ కుమారుడైన మారీచితో ప్రారంభమై కశ్యపుడు, సూర్యుడు, వైవస్వత మనువు ద్వారా కొనసాగి, ఇక్ష్వాకు ద్వారా విస్తరించింది.
ఈ వంశ పరంపరలో కుక్షి, వికుక్షి (శశాదుడు), భానుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకుడు, దుండుమారుడు, మందాతుడు, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనజిత్, యవనాశ్వుడు వంటి మహారాజులు పాలించారు. తరువాత బాహుకుడు, సగర చక్రవర్తి జన్మించారు. సగరుని అరవై వేల మంది కుమారులు అశ్వమేధ యజ్ఞ సమయంలో యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ మహర్షి కపిలుని ఆశ్రమానికి చేరి, అపచారం చేయడంతో ఆయన కోపాగ్నిలో భస్మమయ్యారు. వారికి శాప విమోచనం కోసం గంగానది భూమిపైకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కార్యాన్ని అంశుమాన్, దిలీపుడు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
చివరకు భగీరథుడు దీన్ని తన జీవిత లక్ష్యంగా స్వీకరించారు. పురాణాల ప్రకారం భగీరథుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేయడానికి సుమారు వెయ్యి సంవత్సరాలపాటు కఠోర తపస్సు చేశారు. అనంతరం గంగను భూమికి రప్పించేలా వరం పొందారు. అయితే గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేనందున, పరమేశ్వరుడిని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో, భగీరథుడు మళ్లీ సుమారు వెయ్యి సంవత్సరాలపాటు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన భక్తికి ప్రసన్నుడైన శివుడు గంగను తన జటాలలో ఆపి, నియంత్రించి భూమిపైకి వదిలారు.
ఈ ఘట్టమే గంగావతరణంగా ప్రసిద్ధి చెందింది. అనంతరం భగీరథుడు గంగానదిని ముందుకు నడిపిస్తూ తన పూర్వజుల భస్మం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి వారికి మోక్షం కలిగించారు. ఈ విధంగా ఆయన తన పితృఋణాన్ని తీర్చుకున్నారు. భగీరథుని ఈ కృషి కారణంగా ఎంతో కష్టపడి సాధించిన కార్యాన్ని భగీరథ ప్రయత్నంగా వ్యవహరిస్తారు. భగీరథుడు తన సంకల్పంతో గంగానదిని భూమిపైకి తీసుకువచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. పట్టుదల, భక్తి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని భగీరథుని తపస్సు మనకు సందేశం ఇస్తుంది.
వ్యాసకర్త సెల్: 9014868433
సందపట్ల సాయిగణేష్ సాగర్






