23 April, 2026 | 1:10 AM

బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం

23-04-2026 12:00 AM

భారతదేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల సామాజిక, రాజకీయ ఎదుగుదల విషయంలో జాతీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా హిందూత్వ ఎజెండాతో ఓట్లను సమీకరించుకునే క్రమంలో కేంద్రంలోని అధికార పార్టీ బీసీలను అక్కున చేర్చుకున్నట్లు కనిపిస్తున్నా, కీలకమైన అధికార పంపిణీ, రిజర్వేషన్ల విషయంలో మాత్రం అగ్రవర్ణాల ప్రయోజనా లకే పెద్దపీట వేస్తోందని చరిత్ర చెబుతోంది.

1990లో వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ప్రకటించినప్పు డు, అగ్రవర్గాల ఆధిపత్యంలోని జాతీయ పార్టీలు దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. మండల్ ఉద్యమం వల్ల హిందూ ఓటుబ్యాం కు చీలిపోతుందని భావించిన ఆ పార్టీలు, దానికి ప్రతిగా ‘కమండలం’ రాజకీయాలను తెరపైకి తెచ్చాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినందుకు నిరసనగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని, ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేశాయి.

ఇది బీసీల సామాజిక న్యాయం పట్ల ఆ జాతీయ పార్టీకి ఉన్న వ్యతిరేకతకు తొలి నిదర్శనం. బీసీల జనాభా ఎంత ఉందో తెలిస్తేనే వారికి తగిన బడ్జెట్ కేటాయింపులు, పథకాల ఫలాలు అందుతాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. 2011లో సేకరించిన సామాజిక, ఆర్థి క, కులగణన వివరాలను బయటపెట్టకుం డా తొక్కిపెట్టారు. కులగణన చేయడం సా ధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దా ఖలు చేసి బీసీల అభ్యున్నతి పట్ల తమకు చిత్తశుద్ధి లేదని నిరూపించుకున్నారు.

2023లో పార్లమెంట్‌లో ఆమోదం పొం దిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహి ళా రిజర్వేషన్ బిల్లు)లో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించకపోవడం బీసీలకు చేస్తున్న అతిపెద్ద అన్యాయం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉప కోటా ఇచ్చి, బీసీ మ హిళలను మాత్రం విస్మరించారు. దీనివల్ల చట్టసభల్లోకి అగ్రవర్ణ మహిళలు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం 10 శాతం రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) తీసుకురావడం ద్వారా బీసీల అవకాశాలను పాలకులు తగ్గించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటి మరీ అగ్రవర్ణాలకు మేలు చేయడం ద్వారా, సామాజిక వెనుకబాటుతనం అనే ప్రాతిపదికను బలహీనపరిచారు. బీసీలకు ఉన్న ‘క్రిమీలేయర్’ నిబంధనల కంటే ఈడబ్ల్యూఎస్ నిబంధనలను మరింత సడలించి బీసీల పట్ల మరోసారి వివక్ష చూపించారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో బీసీలకు దక్కాల్సిన 27 శాతం కోటాను అమలు చేయడం లో అధికార పక్షాలు విఫలమవుతున్నాయి. యూపీఎస్సీ ద్వారా కాకుండా ‘లాటరల్ ఎంట్రీ’ పేరుతో ఐఏఎస్ పోస్టుల్లో అగ్రవర్ణాలను నియమించి బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తుంగలో తొక్కుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయ డం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నాయి. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది బీసీ యువతే అని చెప్పనక్కర్లేదు.

కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు బీసీల ఆకాంక్షలను నెరవేర్చకపోగా, వారికి రాజకీయంగా మరిం త అన్యా యం చేసేలా ఉందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఈ బిల్లును బీసీలు వ్యతిరేకించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నప్పటికీ, అందులో బీసీ మహి ళలకు ప్రత్యేక రిజర్వేషన్ల కేటాయింపులు చేయలేదు.

ఎస్సీ, ఎస్టీ మహిళల కు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు దక్కుతాయి. కానీ, బీసీ మహిళలకు అటువంటి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు లేవు. ఫలితంగా పెరుగను న్న లోక్‌సభ స్థానాల్లో మహిళా  రిజర్వేషన్లు అమలైతే, అగ్రవర్ణ మహిళలే ఆ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాల మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించదు. 

ఏ సామాజికవర్గం జనాభా ఎంత ఉం దో తెలియకుండా నియోజకవర్గాలను పునర్విభజించడం బీసీలకు శాపంగా మారు తుంది. కులగణన చేయకుండా సీట్లను పెంచితే, బీసీలు అధికంగా ఉన్న ప్రాంతాలు లేదా వారి ప్రాబల్యం ఉన్న స్థానాలు ప్రభావితం కావచ్చు. కులాలవారీగా డేటా లేనప్పు డు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రభుత్వం సులభంగా పక్కన పెట్టేస్తుం ది. సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, అవి బీసీల చేతుల్లోకి వెళ్లకుండా ఇతర వర్గాలకు మేలు చేసేలా డీలిమిటేషన్ జరిగే ప్రమాదం ఉంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల డీలిమిటేషన్ జరిగితే అక్కడ సీట్లు భారీగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేశాయి. నాటి కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయి. జనాభాను నియంత్రిం చడమే కాదు, అభివృద్ధి పరంగా ఇతర ఉత్తరాది రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచాయి.

కానీ, నేడు అదే దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపంగా మారుతోంది. జనాభా నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాదిలో లోక్‌సభ సీట్ల పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఈ భౌగోళిక మార్పు వల్ల జాతీ య రాజకీయాల్లో దక్షిణాది నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోతుంది. అధిక జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వల్ల సామాజిక న్యాయం కంటే సంఖ్యాబలమే ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇది వెనుకబడిన వర్గాల హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మండల్ కాలం నుంచి నేటి వరకు అగ్రవర్ణ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తే, ఆ పార్టీలు బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి తప్ప, భాగస్వాము లుగా చూడటం లేదని స్పష్టమవుతోంది. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనేది ఒక నినాదంగానే మిగిలిపోయింది. బీసీలకు రావాల్సిన వాటా దక్కకుండా చేయడం, కులగణనను అడ్డుకోవడం, మహిళా బిల్లు లో బీసీ మహిళలకు అన్యాయం చేయడం వంటివన్నీ అగ్రవర్ణ పార్టీల బీసీ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.

131వ రాజ్యాంగ సవరణ బిల్లు బీసీల దశాబ్దాల కల అయిన ‘చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు’ అనే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. కేవలం సీట్లు పెంచడం, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ద్వారా బీసీలకు దక్కాల్సిన వాటాను ప్రభుత్వం కావాలనే మరుగున పడేస్తోందని స్పష్టమవుతోంది. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండా, కులగణన చేయకుండా చేపడుతున్న ఈ ప్రక్రియ సామాజిక న్యాయానికి విరుద్ధమని చెప్పవచ్చు. సామాజిక న్యాయం జరగాలంటే బీసీలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త సెల్: 9494019270

జుర్రు నారాయణ యాదవ్