నేడు ఖమ్మంకు సినీహీరో వెంకటేశ్
కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి తరఫున ప్రచారం
ఖమ్మం, మే6 (విజయక్రాంతి): హీరో వెంకటేశ్ కుటుంబ కథాచిత్రాలకు చిరునామా. చక్కని టైమింగ్, సున్నితమైన హాస్యంతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న నటుడు. అయితే, ఆయన హీరోగానే కాకుండా పొలిటికల్ లీడర్ అవతారమెత్తబోతున్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి తరఫున రోడ్ షోలో సందడి చేయనున్నారు. హీరో వెంకటేశ్ రఘురాంరెడ్డికి వియ్యంకుడు. మామ గెలుపు కోసం ఇప్పటికే వెంకటేశ్ కూతురు ఆశ్రిత జోరుగా ప్రచారం చేస్తున్నారు. గడగడపకూ తిరుగుతూ ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. గతంలో రామానాయుడు పార్లమెంట్‌కు పోటీ చేసిన సందర్భంగా వెంకటేశ్ ప్రచారంలో పాల్గొన్నారు. తరువాత ఇన్నాళ్లు రాజకీయాలకు వెంకీ దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే, నేడు ఖమ్మంలో వియ్యంకుడి తరఫున ప్రచారంలో పాల్గొనబోతుండటంతో వెంకీ ఏం చెప్తారు.. ఎలాంటి అంశాలపై మాట్లాడతారని విషయంపై ఆసక్తి నెలకొంది.




