గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఏఐసీసీ మాల్కాజిగిరి ఇన్‌చార్జి, ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై
ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం
ఎల్బీనగర్, మే 6 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఏఐసీసీ మల్కాజిగిరి ఇన్‌చార్జి, ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పిలుపునిచ్చారు. ఎల్బీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం డివిజన్, వార్డు కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయ, సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ ఇన్‌చార్జి జ్యోతిమణి సెన్నిమలై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు న్యాయ గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గ్యారెంటీ కార్డును ప్రతి ఇంటికీ అందజేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలా ప్రచారం చేయాలని సూచించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలన్నారు. మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో 14 సీట్లను సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.




