9 June, 2026 | 1:12 AM

గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతం

09-06-2026 12:00 AM

మంథని, జూన్ 8 (విజయక్రాంతి): మంథని గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంఘానికి, తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం స్థానికంగా గమనార్హం. మంథని, గంగాపూరి, సూరయ్యపల్లె గ్రామాలకు చెందిన మొత్తం 151 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది.

పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓటింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. బరిలో 11 మంది అభ్యర్థులు నిలవగా, ఎన్నికల ఫలితాల్లో డైరెక్టర్లుగా ఎగోలపు శంకర్ గౌడ్, కొండ్ర రాజయ్య గౌడ్, కమ్మగొని శంకర్ గౌడ్, మాచిడి సత్యనారాయణ గౌడ్, తాటి సమ్మయ్య గౌడ్, మాచిడి వీర శంకర్ గౌడ్, మాచిడి నరేష్ గౌడ్ మరియు తాటి మల్లయ్య గౌడ్ విజయం సాధించారు.

మహిళా కోటాలో తాటి కౌశల్య, ఆరెల్లి సమ్మక్క ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ అధికారి అహమ్మద్ అలీ, అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. సహాయ ఎన్నికల అధికారులుగా అనిల్‌కుమార్, సత్యనారాయణ వ్యవహరించారు. సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికలు గౌడసంఘ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపాయి.