రైల్వే ప్లాట్‌ఫారంపై అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్
- ఐప్యాడ్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం –
- రైళ్లలో చోరీ చేసిన వస్తువులుగా పోలీసుల అనుమానం
నిజామాబాద్,(విజయ క్రాంతి): నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు (GRP), RPF సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బుధవారం స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఎస్‌ఐ హెచ్. సాయిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, RPF సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను గమనించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతడిని వెంబడించి పట్టుకున్నారు.
విచారణలో అతను బొజ్జ ప్రవీణ్ (48), తండ్రి ఫ్రాన్సిస్, మక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీ అని గుర్తించారు. అతని వద్ద ఉన్న ఒక ఐప్యాడ్, రెండు సెల్‌ఫోన్ల గురించి ప్రశ్నించగా, వాటిని రైళ్లలో ప్రయాణికుల నుంచి చోరీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడి వద్ద నుంచి ఐప్యాడ్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ హెచ్. సాయిరెడ్డి వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






