ముంచెత్తుతున్న వర్షాలు
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అందుకు ఉదాహరణే ఈసారి భారీగా కురుస్తున్న వర్షాలు. కానీ ఈ వానాకాలం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. తరచూ మేఘ విస్ఫోటాలు, మెరుపు వరదలు అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వరుసగా కొన్ని రోజుల పాటు అసలు వర్షాలే లేకపోవడం.. ఆ తర్వాత అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడం సర్వసాధారణమైపోయింది.
గత రెండేళ్లలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మొన్నటిదాకా ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన భారీ వరదలు కావొచ్చు.. నిన్న జమ్మూ కశ్మీర్‌లోని చిసోటీ గ్రామంలో సంభంవించిన మెరుపు వరదలు కావొచ్చు.. అన్నింటికి మారుతున్న వాతావరణ మార్పులే కారణమని చెప్పొచ్చు.
మొత్తంగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం దాకా చాలా రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. తాజాగా ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కేవలం ఆరు గంటల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదవ్వడంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టాలపై నీరు చేరడంతో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపేశారు.
విమానాశ్రయాల్లోకి కూడా భారీగా నీరు చేరడంతో చాలా విమానాలు ఆలస్యంగా నడిచాయి. గతవారం దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈసారి తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ఆగస్టు నెల ప్రారంభం నుంచే వర్షంలో తడిసి ముద్దవుతుంది. కొద్ది రోజులుగా భాగ్యనగరంలో సాయంత్రం కాగానే మొదలవుతున్న వర్షం రాత్రంతా కొనసాగుతూనే ఉంది. పొరుగుదేశం పాకిస్థాన్ కూడా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నది.
వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించినట్టు అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఖైబర్ ఫక్తుంఖ్వా, పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, పీవోకే, ఇస్లామాబాద్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ విచిత్ర మార్పు వెనుక భూతాపమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తన నివేదికలో పేర్కొంది.
కానీ ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఈసారి వర్షపాతం నమోదవుతుంది. జూలైలో వర్షపాతం లోటు కనిపించిన ఢిల్లీ, ముంబైల్లో ఆగస్టు వచ్చేసరికి అధిక వర్షపాతం నమోదైంది. ఎప్పటిలానే కేరళను మొదటగా తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. కేరళ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. జూలైలో వానలు లేక అల్లాడిన తెలంగాణ ఆగస్టు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది.
చాలా జిల్లాల్లో సాధారణం నుంచి అధికంగా, కొన్ని జిల్లాల్లో సాధారణం, మరికొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే అనూహ్యంగా వర్షా లు, వరదలు పెరగడానికి కారణాలేమిటని అన్వేషిస్తే.. భూతాపం వల్లే ఇదంతా అని తెలుస్తోంది. 1901 నుంచి 1910 మధ్య ఉన్న భూవాతావరణంతో పోలిస్తే 2011 నుంచి 2025 సంవత్సరాల మధ్య భూ వాతావారణంలో ఉష్ణోగ్రత 0.65 శాతం డిగ్రీలు పెరిగింది.
చల్లటి గాలిలోకన్నా వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వేడిగాలి తేమ వల్ల వా తావరణంలో ఒత్తిడి పెరగడమే కాకుండా వేడిగాలి చోట శూన్యం ఏర్పడి, ఆ శూన్యంలోని పరిసర ప్రాంతాల తేమతో కూడిన గాలులు దూసుకురావడం వల్ల అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ అల్పపీడం ‘సైక్లోన్ సర్కులేషన్’గా మారితే భారీ వర్షాలకు ఆస్కారముంటుంది. భూ మి తిరుగుతున్న వైపే తుఫాన్ ప్రయాణించడాన్ని సైక్లోన్ సర్కులేషన్‌గా వ్యవహరిస్తారు. మొత్తంగా భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఈసారి అధి క వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.






