మట్టి గణపతిలోనే భక్తి
‘భారత దేశ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నుంచి భారతీయ పండగల వెనుక పరమార్ధమూ అదే. నేల, -నీరు, చెట్టు, -పుట్ట, ప్రకృతి ఆరాధన దేశ సంస్కృతిగా కొనసాగుతుంది. పురాణాల్లోనూ మట్టి గణేశుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం. మట్టి వినాయకుడిని పూజించడంతో అనేక యాగాల ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు.
ప్రతీ ఇంట, చుట్టుపక్కల సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మట్టిలో దైవాన్ని చూద్దాం. ప్రకృతిని పరిరక్షించుకుందాం.’ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసే విగ్రహాల వల్ల హాని, ముప్పును ఉంటుంది. రాష్ర్టం, భాగ్యనగరంలో చెరువుల పరిస్థితి అసలే అంతంత మాత్రం. చాలా వాటిల్లో మురుగు వదిలి జలాలను విషంగా మారుస్తున్నారు. రసాయన విగ్రహాల నిమజ్జనంతో ఇవి మరింత కలుషితంగా మారుతున్నాయి. సహజ రంగులే వాడుదాం-.. రసాయన రంగులు మానేద్దాం.
జల సిరులను కాపాడుకుందాం.. ఎత్తుని తగ్గిద్దాం-.. భక్తిని పెంచేద్దాం. మట్టి గణపతే- మహా గణపతి. త్వరలో ఎన్నికలున్న సందర్భంగా రాజకీయ నాయకుల వద్ద చందాలు దండిగా వసూలు చెయ్యాలన్న తలంపుతో హానికారక రసాయన రంగు బొమ్మలు కొందరు పెడుతున్నారు. పోటీ అభ్యర్ధులు సైతం గెలుపు తపనతో ఓటర్లను ఆకర్షించేలా రూ. వేల నుంచి రూ.లక్ష వరకూ ఒక్కో మండపానికిచ్చి ఎర వేసిన సందర్భాలూ ఉన్నాయి.
మట్టి వినాయకులనే పూజించాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం చేసిన వారే పదవులు కోసం తిరిగి కాలుష్య కారక విగ్రహాలు పెట్టేందుకు సహకరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు, అధికారులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు తక్షణం మేల్కొని కాలుష్యం నివారించే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
హిందూ సంస్కృతిలో భాగమైన వినాయక చతుర్ధిని పర్యావరణ ప్రియంగా జరుపుకోవడానికి అంతా సిద్ధమవ్వాలి. ‘ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ’, నాగోల్ ‘తిరంగా యూత్ అసోసియేషన్’ను ఆదర్శంగా తీసుకొని మట్టి గణపతిని పూజిద్దాం.
వ్యాసకర్త: తలారి గణేష్






