దుర్గం చెరువు కాస్తా ‘దుర్గంధం’ చెరువు!
వ్యర్థాల కాసారంగా మారిన పర్యాటక ప్రాంతం..
పాలకుల నిర్లక్ష్యంపై నగరవాసులు, పర్యాటకుల తీవ్ర ఆగ్రహం
రంగారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి ‘దుర్గం చెరువు(Durgam Cheruvu)‘ నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురై దుర్గంధ నిలయంగా మారింది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకున్న ఈ చారిత్రాత్మక సరస్సు, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణ లోపంతో మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కంపు కొడుతోంది.
చెరువులోకి నేరుగా గృహాల నుంచి వస్తున్న అశుద్ధ పదార్థాలు, సెప్టిక్ ట్యాంక్ మురుగునీరు కలవడంతో నీరు తీవ్రంగా కలుషితమైంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి రోజూ వేల సంఖ్యలో చచ్చిన చేపలు నీటిపై తేలుతూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. సరస్సు పరిసరాల్లో నిమిషం పాటు నిలబడాలన్నా సెప్టిక్ ట్యాంక్ పక్కన కూర్చున్నంత అసహ్యకరమైన కంపు వస్తోందని పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆవేదన..
సుదీర్ఘ పోరాటాల తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన సహజ వనరులు, సరస్సులు సుందరీకరించబడతాయని ఆశించిన నగరవాసులకు ఈ దుస్థితి తీవ్ర నిరాశను మిగిల్చింది. రాష్ట్ర సాధన కోసం పోరాడిన మన కళ్ల ముందే మన నగరానికి మకుటం లాంటి దుర్గం చెరువు ఇలా దరిద్రపు కంపు కొడుతుంటే గుండె తర్క్కుపోతోందని తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత గాయకుడు మిట్టపల్లి సురేందర్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం, కనీస పారిశుద్ధ్య నిర్వహణను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహన లోపం..
ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జిహెచ్‌ఎంసీ, పర్యాటక శాఖల మధ్య సమన్వయ లోపం ఈ నిర్లక్ష్యం కారణంగానే చెరువు ఈ దుస్థితికి చేరిందని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు.
వెంటనే చర్యలు చేపట్టాలి..
అధికారులు తక్షణమే స్పందించి చెరువులోకి మురుగు నీరు రాకుండా అడ్డుకోవాలని, చచ్చిన చేపలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి దుర్గం చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని నగరవాసులు, పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.






