బలోపేతం దిశగా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోతతో రెచ్చిపోతున్న వేళ వాణిజ్య బంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా, జపాన్ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీ ఈ నెల 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. తియాంజిన్ వేదికగా జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ పాల్గొంటారు.
గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం భారత ప్రధాని చైనాలో పర్యటిస్తుండటం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. షాంఘై సదస్సు అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ కానున్నారు. పేరుకు ద్వైపాక్షిక చర్చలయినప్పటికీ ఈసారి సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌తో సమావేశం ఆసక్తి రేపుతుంది.
రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ నుంచి ఎగుమతయ్యే జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్ యంత్రాలపై సుంకాల భారం పడనుంది.
అమెరికా విధించిన సుంకాలకు తాము భయపడేది లేదని భారత్ కుండబద్దలు కొట్టడమే గాక.. ట్రంప్ సుంకాలను తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. ఇందులో భాగంగా చైనాతో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు.
పలు రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్ధే లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పటికే జపాన్‌కు చేరుకున్న మోదీకి.. ఆ దేశం అండగా నిలబడినట్టు తెలుస్తోంది. భారత్ బాటలోనే అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదంటూ జపాన్ తేల్చి చెప్పింది. వాణిజ్య చర్చల్లో భాగంగా జపాన్‌తో అమెరికా ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కానీ జపాన్ వాణిజ్య మంత్రి ర్యోసీ అకజవా ఆఖరి క్షణంలో అమెరికా టూర్‌ను రద్దు చేసుకున్నారు.
మోదీ టోక్యోకు చేరుకున్న రోజునే ఈ పరిణామం జరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు బ్రిక్స్ కూటమి ఎదుగుదలను అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా కూటమిలో భారత్, చైనా ప్రాబల్యం పెరగడాన్ని తట్టుకోలేకపోతుంది. డాలర్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నయాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న బ్రిక్స్ దేశాల అభిమతాన్ని తప్పుపడుతోంది.
బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీలో 32 శాతం, చమురు ఉత్పత్తిలో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే వాణిజ్యం పేరుతో బ్రిక్స్ కూటమిలోని దేశాలకు చెక్ పెట్టాలని భావించి ట్రంప్ అదనపు సుంకాలతో హెచ్చరికలు జారీ చేశారు. అయితే బ్రిక్స్ కూటమి స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు సాగుతుండటం అమెరికాకు మింగుడుపడని అంశం.
అమెరికాకు తాను వ్యతిరేకం కాదని తెలియజెప్పేందుకు యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాతో కలసి భారత్ ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడిందన్నది వాస్తవం. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ కలవనున్నారు. జిన్‌పింగ్ సమక్షంలో ఈ భేటీ జరగనుంది. అమెరికాతో ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్న వేళ ఈ ముగ్గురి భేటీ మూడు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత పటిష్టం చేస్తుందేమో చూడాలి.






