మోదీ పాలనలో దేశాభివృద్ధికి పునాది
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్
- పాల్గొన్న మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్
- జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి
- ఘనంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ 12ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధికి బలమైన పునాది పడిందనిబీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల రంగాల్లో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, అధికార ప్రతినిధి సంఘప్ప హాజరై మాట్లాడారు. 2014 నుంచి విశ్వాసం, అభివృద్ధి, జనక కళ్యాణం లక్ష్యంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు పేదలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
వందే భారత్ రైళ్లు, ఎక్స్ప్రెస్వేలతో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని, యూపీఐ డిజిటల్ చెల్లింపులు, డీబీటీ ద్వారా అవినీతి రహిత పాలన సాగుతోందని వివరించారు. జాతీయ భద్రతలో రాజీ పడకుండా సర్జికల్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ఇన్చార్జ్ నందనం దివాకర్, సీనియర్ నాయకులు వెంకటరమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, జిల్లా ఉపాధ్యక్షుడు కనకట్ల హరి, మద్దెర్ల శ్యాంసుందర్, నాగేశ్వర్ రెడ్డి, మహిళా నాయకురాళ్ళు,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
భరత మాత ముద్దుబిడ్డ, కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మేకల కీర్తి హర్ష కిరణ్ డివిజన్ సీనియర్ నాయకులతో కలిసి ఘనంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేయడంతో పాటు, స్థానిక వృద్ధాశ్రమంలోని అవ్వాతాతలకు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీకల కీర్తి హర్ష కిరణ్ మాట్లాడుతూ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ కిషన్ రెడ్డి కి ఉండాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని, వారు రాజకీయంగా భరతమాత సేవలో ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు హరి కిరణ్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమంతు ముదిరాజ్, సతీష్ నేత, శ్యాం రాజ్, సత్యనారాయణ, భిక్షపతి,వెంకటేష్ యాదవ్ ,బాలయ్య,నాగరాణి,వసంత, కిరణ్,వినోద్, శ్రీకాంత్, ప్రేమ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






