8 May, 2026 | 1:04 AM

ఘనంగా టీపీఏ దశాబ్ది ఆవిర్భావ వేడుకలు

08-05-2026 12:02 AM

మంచిర్యాల టౌన్, మే 7 : తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ రోడ్డులోని ప్రకృతి మిత్ర కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రాంచందర్ సూచనల మేరకు నిర్వహించిన ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్, కౌన్సిలింగ్ సైకాలజిస్టు రంగు వేణు కుమార్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుఖదేవ్ సహా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పును ప్రస్తావించారు. నేటి సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యల వరకు వెళ్తున్న ఆందోళనకర పరిస్థితులను సుప్రీంకోర్టు గుర్తించిందని పేర్కొన్నారు. వాటి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 కీలక మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆ మార్గదర్శకాల ద్వారా సైకాలజిస్టులు, సైకాలజిస్ట్స్ అసోసియేషన్లపై సమాజపరమైన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే దిశగా ప్రతి సైకాలజిస్టు ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 9, 10 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వెన్షన్, అవార్డుల ప్రధానోత్సవంలో మంచిర్యాల జిల్లా కమిటీ నుంచి పలువురు సైకాలజిస్టులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సుమన చైతన్య, అడ్వైజర్ గుండేటి యోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, తాళ్లపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.