లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్..
చిక్కడపల్లి లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల వద్ద నిరసన ప్రదర్శన
ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనవని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్ డిమాండ్ చేశారు. కార్మిక శాఖ నిర్వహించిన సోషల్ సెక్యూరిటీ కోడ్-2026 రూల్స్పై అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు మేలు చేసిన 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల అమలుకు ముందుకు రావడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలును నిరాకరించాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బి.వెంకటేశం, కమతం యాదగిరి, బొడ్డుపల్లి కిషన్, చెట్టుక్రింది శ్రీనివాస్, పాలడుగు భాస్కర్, భూపాల్, జె.వెంకటేష్, వంగూరి రాములు, రమా, విజయ్కుమార్, సూర్యం, పద్మ, శ్రీనివాస్, అనురాధ, రాంబాబు, భరత్ తదితరులు పాల్గొని లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






