14-03-2025 12:21:59 AM
కాగజ్ నగర్, మార్చి 13 (విజయ క్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుంది. 60 వేల జనాభా కలిగిన పట్టణంలో రద్దీ పెరుగుతుండటంతో పాటు యథేచ్ఛగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పట్టణంలో ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్నప్రాంతాల్లో 50 ఫీట్ల వెడల్పుతో రహదారులు ఉన్నాయి.
ఈ రహదారులపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లతో పాటు సరుకు రవాణా చేసే లారీల వంటి పెద్ద వాహనాలు సైతం నడుస్తుంటాయి. రహదారులు వెడల్పుగా ఉన్నప్పటికీ వ్యాపారస్తులు తమ దుకాణాల ముందు 5 నుండి పది ఫీట్ల వరకు సామాన్లు పెడుతుండటం, హోటల్ వంటి దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కువ సమయం నిలిపేస్తుండటంతో సమస్య ఉత్పన్నమవుతుంది.
పట్టణంలోని రాజీవ్ గాంధీ కూడలిలో, అంబేద్కర్ కూడలిలోని హోటళ్ల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. హోటళ్లలో టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వచ్చిన వారు తమ వాహనాలను గంటల పాటు యథేచ్ఛగా రహదారిపై నిలిపేస్తుండటంతో సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
వాహనాల రద్దీ తీవ్రంగా ఉన్నప్రాంతాల్లో అధికారులు, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొన్ని హోటళ్ల యజమానులు తమ దుకాణాల ముందున్న పార్కింగ్ స్థలంలో యథేచ్ఛగా కుర్చీలు వేసి మరి వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికి అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రతి చిన్న విషయానికి ఫైన్లు వేసే అధికారులు హోటళ్ల ముందు వాహనాలు నిలిపితే పట్టించుకోకపోవడం ‘మాములు‘ విషయమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
షాపుల ముందు పార్కింగ్‌కు స్థలం ఉంచాలి
వ్యాపార సముదాయాల ముందు తగిన పార్కింగ్ స్థలం ఉండేలా వ్యాపారస్తులు చూసుకోవాలి. రహదారులపై వ్యాపార సామగ్రి పెడితే చర్యలు చేపడతాం. పాదచారులకు, వాహన దారులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. త్వరలో పోలీస్ శాఖ సహాయంతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం.
-అంజయ్య, మున్సిపల్ కమిషనర్