26-08-2025 11:16:39 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కార్మిక హక్కుల కోసం పోరాడే వ్యక్తినే గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో మాట్లాడారు. కాకా కుటుంబం 70 ఏళ్లుగా కార్మికుల పక్షాన నిలబడిన విషయాన్ని గుర్తు చేశారు. 250 ఐడిపీఎల్ సాధించేందుకు కార్మిక రంగంలో 49 రోజుల సమ్మె చేసిన ఘనత కాక కుటుంబానికి దక్కిందన్నారు.
తన తండ్రి, తాను, తన సోదరుడు కార్మిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఓరియంట్ సిమెంట్ కంపెనీ ని నిర్వహిస్తున్న ఆదాని కంపెనీతో మాట్లాడాలంటే ఎవరికైనా గుండె ధైర్యం కావాలని అన్నారు. తాము మద్దతిస్తున్న పెద్దపులి గుర్తు అభ్యర్థి విక్రమ్ రావు ను గెలిపించాలని కార్మికులను కోరారు. విక్రమ్ రావును గెలిపిస్తే ఆదాని, ప్రధాని మోదీ లాంటి వాళ్లని ఒప్పించైనా ఓరియంట్ సిమెంట్ కంపెనీ అభివృద్ధికి తమ వంతు పాటుపడతామని కార్మికులకు చెప్పారు.