calender_icon.png 27 August, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

14-03-2025 12:21:40 AM

గద్వాల, మార్చి 13 (విజయక్రాంతి) : సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామంలో నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పొలాల్లో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించారు. వరి పంటలు నీటి కొరత కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. ర్యాలంపాడు ఎడమ ప్రధాన కాలువ 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, మైలగడ్డ గ్రామాల వద్ద కాలువ ప్రవాహాన్ని, నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు.

కాలువలో నీటి విడుదల, పంపిణీ విధానం, ఆయకట్టు పరిధిలోని ప్రాంతాలకు నీరు చేరుతున్న తీరును తెలుసుకునేందుకు అక్కడి పంపింగ్ స్టేషన్లు మరియు పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడి రైతుల అభ్యర్థన మేరకు తక్షణమే సాగునీటిని కాలువల్లోకి విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా సరఫరా అవుతున్న నీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు కూడా అందేలా సమతుల్యతను పాటించాలనీ సూచించారు.

కాలువల ద్వారా నీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు చేరకుండా ఎగువ ప్రాంతాల్లోని రైతులు మోటార్లు, పంప్ సెట్లు ఉపయోగించి నీటిని వినియోగిస్తున్న పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. ఇలా కాకుండా కాలువల వెంట నీటి వినియోగాన్ని సమతుల్యంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. నీటి ప్రవాహం చివరి ఆయకట్టు వరకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని, వారి పంటలను కాపాడేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకొని సాగునీటి సరఫరా పద్ధతులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ.ఈ రహీముద్దీన్, వ్యవసాయ అధికారి సక్రియ నాయక్,ఏడీఏ సంగీత లక్ష్మి ,విద్యుత్ శాఖ ఎ.డి. రమేష్ బాబు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.