బేగంపేట్‌లోని మెథడిస్ట్ కాలనీలో విషాదం
- మూడవ అంతస్తులోని బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరి మృతి
- మరోకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
సికింద్రాబాద్, మార్చి, 22 (విజయక్రాంతి): కుందన బాగ్ శ్రీవాత్సవ అపార్ట్ మెంట్‌లో బాల్కనీ స్లాబ్ కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మృతిచెందారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (60), అతడి అల్లుడు వరుసైన వివేక్ (30)లు ఎలక్ట్రిషియన్లు గా పనిచేస్తున్నారు.
కుందన్‌బాగ్ మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్సవ అపార్ట్‌మెంట్ యజమాని ద్వారకాప్రసాద్ ఎలక్ట్రీషియన్ పనుల కోసం వారిని పిలిపించాడు. ముగ్గురు కలిసి మూడో అంతస్తుకు వెళ్లగా.. అక్కడ బాల్కనీ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ముగ్గురు కిందపోయారు. ఈ ఘటనలో దేవీదాస్, వివేక్ లు అక్కడికక్కడే మృతిచెందగా, యజమాని ద్వారకా ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురికి తరలించారు. యజమాని ద్వారకా ప్రసాద్ స్థానిక ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




