15 May, 2026 | 10:56 PM

Breaking News

మెట్టుగూడలో రైలు ప్రమాదం

21-06-2024 12:10 AM

షార్ట్‌సర్క్యూట్‌తో  రెండు బోగీలు దగ్ధం 

ప్రయాణికులు లేకపోవడంతో  తప్పిన ప్రాణనష్టం

కంటోన్మెంట్, జూన్ 20: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ రైల్ నిలయం వద్ద గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చేలరేగి రెండు ఏసీ బోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాషింగ్‌కి వెళ్లిన రైలు ఫ్లాట్ ఫామ్ మీదకు వస్తున్న సమయంలో అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. వాటి నుంచి వచ్చిన దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి.

సమాచారం అందుకున్న రైల్వే ఫైర్ సెఫ్టీ సిబ్బంది, రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇతర కోచ్‌లకు మంటలు వ్యాపించకుండా వేరు చేశారు. పాంట్రీకార్ కోచ్‌లో మెయింటెనెన్స్ చేస్తున్న సమయంలో మంటలు వచ్చినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ప్రమాదానికి గురైన ప్యాంట్రీ కార్ కోచ్‌ను సందర్శించా రు.  ప్రమాదానికి సంబంధించిన అంశాలపై సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైనా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. 

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): భవిష్యత్తులో రైల్వే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. మెట్టుగూడలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం రైల్వే ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 గంటల సమయంలో ప్యాంట్రీ కోచ్‌లో మంటలు చెలరేగితే వెంటనే సిబ్బంది స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫైర్ సర్వీసుకు ఫోన్ ద్వారా సమాచారం అందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఉదయం 11.30 గంటల వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు.