10-09-2025 12:00:00 AM
రైల్వేట్రాక్‌ను పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు
మహబూబాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ నుంచి కాజీపేట వరకు నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై ఇక రైళ్లు చకచకా పరుగు పెట్టనున్నాయి. ఇప్పటికే కాజీపేట నుంచి నెక్కొండ వరకు బీడీ లైన్ పనులు పూర్తిచేసి రైళ్లు నడుపుతున్నారు. తాజాగా నెక్కొండ నుంచి ఇంటికన్నె, కేసముద్రం, తాళ్లపూస పల్లి, మహబూబాబాద్ వరకు మూడో లైన్ నిర్మాణం పూర్తి చేశారు. రైల్వే ట్రాక్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేసి మంగళవారం పిసిసిఈ అధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా రైల్వే కోచ్ (సెలూన్) ద్వారా నెక్కొండ నుంచి కేసముద్రం, మహబూబాబాద్ వరకు పూర్తి చేసిన ఓహెచ్‌ఈ పనులను పరిశీలించారు. పరిశీలన అనంతరం అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో మూడో లైన్ పై రైళ్ల రాకపోకలు సాగించడానికి అనుమతి లభిస్తుంది.
కాజీపేట నుండి ప్రస్తుతం నెక్కొండ వరకు బీడీ లైన్ (మూడో ట్రాక్) పై రైళ్ల రాకపోకలు సాగుతుండగా, కొద్దిరోజుల్లో మహబూబాబాద్ వరకు కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఉన్న బ్రాడ్ గేజ్ అప్ , డౌన్ మార్గాల్లో రైళ్లు నడుపుతుండగా, అదనంగా మరో రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. దీంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకల తో పాటు గూడ్స్ రవాణా రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండా మూడు రైల్వే లైన్ల పై నడపడానికి అవకాశం ఏర్పడనుంది.