రైతులకు తెలియకుండా పట్టాల మార్పిడి?
- రెవెన్యూ అధికారులే చేస్తున్నారని ఆరోపణలు
- అన్యాక్రాంతమవుతున్న పేదల భూములు
- మంత్రి అనుచరుడి కనుసన్నల్లో తహసీల్ కార్యాలయం
- న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ బాధితుల ప్రదిక్షణలు
- మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిధిలో ఉదంతం
మంచిర్యాల, జూలై 26 (విజయక్రాంతి): నాయకులకు అధికారులు జోడైతే ఏదైనా మార్చవచ్చుననడానికి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలమే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటూ తహసీల్ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మండలానికి చెందిన ఓ నేత ఆటలాడుతున్నాడు. చిన్న రైతులను బెదిరించో, రైతుకు తెలియకుండానే పట్టాలు మార్చి వారి భూములను ఆక్రమించుకుంటుండగా దీంతో న్యాయం కోసం రైతులు పోలీసు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పలరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది.
ఆమ్యామ్యాలకు ఆశపడ్డ రెవెన్యూ అధికారులు అడ్డదిడ్డంగా పట్టాదారు, అనుభవదారు కాలంలలో పేర్లను మార్చడం, ఎవరు డబ్బులిస్తే వారి పేర్లను చేర్చడంతో అసలు పట్టాదారులు, కొనుగోలు చేసిన రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ భూ ‘ఆక్రమణల రెడ్డి’కి ఎదురు తిరిగితే చంపుతామని బెదిరించడం, చట్టాన్ని చేతుల్లో పెట్టుకొని భయపెట్టడం ఆనవాయితే.. నాయకులకు చెప్పుదామంటే ఆ ‘రెడ్డి’ అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే అందులోనే ఉంటుండటంతో ఏం చేయలేని పరిస్థితి బాధితులది.
కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఓ భూకబ్జాదారుడికి అధికారులు తొత్తులుగా పని చేస్తుండటంతో బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. సామాన్యుల, రైతుల భూములపై కన్నేసి బెదిరింపు చర్యలకు పాల్పడటం,న్యాయం కోసం అధికారులను, పోలీసులను బాధితులు సంప్రదిస్తే మంత్రి అనుచరులని ‘మామూలు’గా తీసుకుంటు వారి ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు సైతం భూబదలాయింపుల సమయంలో అన్ని రికార్డులు సరిచూశాకే పట్టాదారుడి పేరును మార్చుతుంటారు.
కానీ కోటపల్లిలో మాత్రం డబ్బులిస్తే ఏదైనా జరుగుతుంది అనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. తహసీల్ కార్యాలయం కొందరి చెప్పుచెతుల్లోనే నడుస్తుందని, అక్కడ ఏ పని జరగాలన్నా పెద్దల ఆశీర్వాదం ఉంటేనే అని కొందరు రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో మంగలి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు వారికి ఇష్టమొచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో అసలు రైతు ఇబ్బందులు పడుతున్నాడు.
సిర్సా గ్రామంలో 117 సర్వేలో 3.02 ఎకరాల వ్యవసాయ భూమి చిట్యాల (మంగలి) ఆశయ్య పేరిట ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండానే 1988 - 89 పహాణిలో ఖాతాదారుడిగా మంగలి ఆశయ్య పేరుండగా ఆక్రమణదారుడి కాలంలో గొడిసెల రాజిరెడ్డి పేరును చేర్చారు. 1989 - 90లో తిరిగి మంగలి ఆశయ్య పేరొక్కటినే నమోదు చేశారు.తిరిగి 1992 - ఖాతాదారుడి కాలంలో మంగలి ఆశయ్యను, ఆక్రమణదారుడి కాలంలో గొడిసెల రాజిరెడ్డి చేర్చిన అధికారులు 2000 ఖాతాదారుడి కాలంలో మంగలి ఆశయ్యను, ఆక్రమణదారుడి కాలంలో దాగామ (మంగలి) పోచంను చేర్చారు. తీరా 2010 పోచం పేరును తొలగించి ఖాతాదారుడి కాలంలో గొడిసెల దేవకి పేరును నమోదు చేశారు.
అది కొనుగోలు ద్వారానా, సాదా బైనామా ద్వారానా, మరే ఇతర పద్దతుల ద్వారా నమోదు చేశారో అధికారులకే తెలియదంటా... ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారులను ఈ విషయమై అడిగితే గతంలో జరిగిన విషయం మాకెలా తెలుస్తుంది, మా వద్ద ఏ పద్దతిలో పేరు మార్చారో దానికి సంబంధించిన పత్రాలు ఏమీ లేవనడం విడ్డూరంగా ఉంది. మరోవైపు ఖాతాదారుడి కాలంలో పేరును అలాగే ఉంచి రెండు, మూడు సార్లు బాపురెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడానికి అధికారులు ఎంతో ప్రయత్నించి చివరికి ఖాతాదారుడి పేరుతో సహా మార్చారు. ఈ విషయమై మండల తహసీల్దార్ రాఘవేంద్రరావును ‘విజయక్రాంతి’ సంప్రదించగా అవి గతంలోనే జరిగాయని, ఒక పట్టాదారు నుంచి మరో పట్టాదారుడి పేరిట ఎలా మార్చారో దానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు అందుబాటులో లేవని, ప్రస్తుతం వి చారణ జరుపుతున్నామని జావాబిచ్చారు.
మంత్రి గారు.. మాకు న్యాయం చేయండి
బాధితులు దాగామ లచ్చయ్య, బుజ్జవ్వ దంపతులు
మంత్రి గారు.., మాకు సిర్సా గ్రామంలో మంగలి వృత్తి చేసుకునే చిట్యాల రామయ్య అలియాస్ మంగలి రామయ్య ఉపాధి కోసం 1995లో వేరే గ్రామానికి వలస వెళ్లే క్రమంలో ఆ భూమిని మా తండ్రి దాగామ పోచయ్యకు కౌలుకు ఇచ్చిండు.1998లో రామయ్య అవసర నిమిత్తం ఆ భూమిని మా నాన్న(పోచయ్య)కు సాదాబైనామా ద్వారా విక్రయించాడు. ఆ భూమిని మా తండ్రి బతికి ఉన్నంత వరకు సాగు చేస్తూ మా కుటుంబాన్ని సాదాడు. ఆయన మరణానంతరం నేను (దాగామ లచ్చయ్య) సైతం ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ నా ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెండ్లిలు చేశాను. ఈ ఏడాది సైతం ఆ భూమిలో జొన్నలు, పెసరు, పత్తి పంటలు వేశాను.
ఈ క్రమంలో ఆ భూమిపై కన్నేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి అనుచరుడు ఈ నెల 12న నా భూమిలోకి చొరబడి పంట ధ్వంసం చేయడమే కాకుండా ఈ భూమి తనదని, వస్తే చంపుతామంటూ బెదిరించారని ఏడుస్తూ వాపోయారు.ఈ విషయమై తహసీల్దార్, పోలీసులకు చుట్టూ తిరుగుతున్నామని, కబ్జాదారుడు మంత్రి అనుచరుడని మమ్ముల పట్టించుకోవడం లేదని, ఇక మాకు చావే శరణ్యమంటూ రోదించారు. రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్న వారిని మంత్రి దగ్గరకు తీస్తుండటం వల్లనే విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మాకు సరైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.






