22 July, 2026 | 4:07 PM

శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..

22-07-2026 03:29 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని శాంతినగర్‌లో 'నంది ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "వజ్రం ప్యూర్ ఫైర్" శుద్ధ జల కేంద్రాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి శుద్ధ జల కేంద్రాలను నెలకొల్పడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ ఆర్ఓ ప్లాంట్‌లో ఐయోనైజేషన్ వంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో విభిన్న దశలలో నీటిని శుద్ధి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజలకు స్మార్ట్ కార్డుల ద్వారా 20 లీటర్ల క్యాన్లలో రక్షిత మంచినీరు సులభంగా అందుబాటులోకి రానుందని చెప్పారు.

కేవలం బోరు నీటిని శుద్ధి చేయడమే కాకుండా, ప్లాంట్ నుండి వచ్చే వ్యర్థ నీటిని సమీపంలోని ప్రభుత్వ వసతి గృహాల వినియోగానికి మళ్లించడం ఎంతో మంచి పరిణామమని ప్రశంసించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని, రాబోయే 20 నుండి 30 రోజుల వరకు పంటలకు నీటి కొరత ఉండదని హర్షం వ్యక్తం చేశారు. అయితే వర్షాల అనంతరం ఎండలు కాసే అవకాశం ఉన్నందున డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా "డ్రై డే" పాటించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ శుద్ధ జల కేంద్రం దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా స్థానిక ప్రజలు, అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహణ బాధ్యతలను చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రిత్విక్ సాయి కోటే, ఎంపీడీఓ రైసుద్దీన్ , నంది ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ అనిత, మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.