పారదర్శకంగా మూసీ పునర్జీవనం
ప్రజాస్వామ్య పద్ధతిలో పనులు
- 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు ఆన్‌లైన్‌లో నమోదు
- విలువైన సూచనలు చేసినవారితో సబ్ కమిటీ భేటీ
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
- మూసీ పునర్జీవనం పనుల ప్రగతిపై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మూసీ పునర్జీవనం పనులు పార దర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ క్యాబి నెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మూసీ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మూసీ పునర్జీవనం పనుల ప్రగతిపై డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ (musridc@gmail.com) ద్వారా మూసీ పునర్జీవనంపై ప్రజల అభిప్రాయా లు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన విలువైన సలహాలు, సూచనలను అన్నింటినీ అధికారులతో కలిసి విశ్లేషణ చేసి, అభిప్రాయాలు వెల్లడించినవారితో నేరుగా దశలవారీగా క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సంప్రదింపులు చేస్తారని పేర్కొన్నారు.
మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు మార్చి 28న శంకుస్థాపన చేశామని, ఆ రోజు నుంచి మూసీ ఫేస్--1, ఫేస్-2 వరకు చేయాల్సిన పనుల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. డిఫెన్స్ భూములు, పునరావాసం, నిర్మాణ డిజైన్లను తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్‌తో మాట్లాడటం ఇలా పనులను ఎక్కడికక్కడ విభజన చేసుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, యావత్ క్యాబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని, మీ జీవితాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులకు వెల్లడించారు. అధికారులకు ఎలాంటి సలహాలు, సూచన ఇతర ఏ అవసరాలు ఉన్నా మూసీ సబ్ కమిటీ సభ్యులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.
సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్‌కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మను చౌదరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.




