రాబడి దిశగా రవాణా!
- ఆదాయం మార్గాలపై ఆర్టీఏ అన్వేషణ
- ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం
- ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న బృందాలు
- రాష్ట్రంలో బెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ పాలసీ తెస్తామంటున్న మంత్రి పొన్నం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. రవాణా శాఖ వివిధ సేవల ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి శాఖ నుంచి మరింత ఆదాయాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయ మార్గాలపై రవాణా శాఖ దృష్టి పెట్టింది.
అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఆర్టీఏ అధికారుల బృందాలను పలు రాష్ట్రాలకు పంపింది. అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యత్తుమ విధానాలను అధ్యయనం చేసేందుకు రవాణా శాఖ అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఒక డీటీసి, ఆర్టీవో, ఎంవిఐ ఒక్కో బృందంగా ఏర్పడి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు. అధికారుల నివేదిక అనంతరం అత్యుత్తమ విధానాలను తెలంగాణ రవాణా శాఖలో అమలు చేయనున్నారు.
అధ్యయనం చేసేది ఈ అంశాలనే..
5 రాష్ట్రాల్లో పర్యటిస్తున్న బృందాలు ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అక్కడి రవాణా శాఖ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్, వెహికిల్ టారిఫ్, వెహికిల్ ట్రాకింగ్, వెహికిల్ రిజిస్ట్రేషన్, వెహికిల్ ఫిట్‌నెస్, వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ, డ్రైవింగ్ టెస్టింగ్, లైసెన్స్ జారీ విధానం, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలు, రెవెన్యూ రిపోర్ట్, రోడ్డు భద్రతపై అవగాహన, చెక్ పోస్టుల ఎత్తివేత, తదితర అంశాలపై తెలంగాణ ఆర్టీఏ బృందా లు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఎలా ఉంది, అందులో అత్యు త్తమ విధానాలను తెలంగాణలో ఉపయోగించేందుకు అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోనుంది.
తెలంగాణలో బెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ పాలసీ అమలు చేస్తాం
వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రవాణా విధానాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను పంపించాం. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తారు. అందులో బెస్ట్ పాలసీని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. వీటితో పాటు ఒక్కో రాష్ర్టంలో ఒక్క రకమైన పన్నుల వ్యవస్థను ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న మార్గాలు, అక్కడ అమలవుతున్న వాటిలో మంచి టాక్సేషన్ ఇక్కడ అమలయ్యేలా చూస్తాం. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఇతర రాష్ట్రాల్లోని అత్యుత్తమ సాంకేతిక విధానాలను సైతం మన రాష్ట్రంలో అమలు చేస్తాం.
రవాణా శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్






