పేదింటి బిడ్డకు ఎంబీబీఎస్ సీటు
చదువుకు సాయం కోసం ఎదురుచూపు
ఆర్థిక సాయం చేయాలని వేడుకోలు
గజ్వేల్, జూన్ 25: పేదింటిలో పుట్టినప్పటికీ విద్యకు పేదరికం అడ్డుకాదని నిరూపిం చింది లక్ష్మీప్రసన్న. ‘నీట్’లో 438 మార్కులు సాధించి వనపర్తి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. ఆమె స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్. ఒకటి నుంచి పదోతరగతి వరకు నుంచి ఆమె ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించింది. ఇంటర్మీడియట్ గురుకులంలో చదివి 948 మార్కులు సాధించింది.
ఇటీవల నీట్‌లోనూ సత్తా చాటింది. ఎంబీబీఎస్ సీటు సాధించి వైద్యురాలిని కావాలనే కల నెరవేర్చుకున్నది. కానీ చదువుకు అయ్యే డబ్బు లేక ఇబ్బంది పడుతోంది. మల్లన్నసాగర్ ముంపు తో వారు భూమి కోల్పోయారు. వచ్చిన పరిహారం తో తండ్రి మల్లేశం ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. 2019లో రోడ్డుప్రమాదం సంభవించి లక్ష్మీప్రసన్న తల్లి మృతిచెందింది. తండ్రి మల్లేశం అనారోగ్యంతో పనిచేసే సత్తువ కోల్పోయాడు. మూడో కుమార్తె లక్ష్మీప్రసన్నను వైద్యురాలిని చేయాలనే కల మిగలిపోవడం తో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నా డు. ఎవరైనా సహృదయంతో లక్ష్మీప్రసన్న చదువుకు సాయం చేయాలనుకుంటే 94411 03300 నెంబరులో సంప్రదించాలని తండ్రి కోరుతున్నాడు.






