19 August, 2026 | 2:59 AM

మెడికవర్‌లో సుడాన్ రోగికి చికిత్స

19-08-2026 12:00 AM
  1. మూడేళ్లుగా వంగిన మోకాలు
  2. మళ్లీ నడిచేలా చేసిన వైద్యులు

హైదరాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో ‘సుడాన్‌కి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.

ఆశలు వదులుకోకుండా హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి వచ్చిన రోగిని ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ వీరగంధం పరీక్షించారు. మోకాలి చుట్టూ గత ఆపరేషన్ల కారణంగా పెద్ద మచ్చలు ఏర్పడటం, ఎముకలు దెబ్బతినడం, మోకాలి సహజ ఆకారం మారిపోవడం, పాత గాయం వల్ల మోకాలిచిప్ప తీవ్రంగా దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

మోకాలి చుట్టూ చర్మం, కండరాలు, ఇతర కణజాలం కూడా బాగా దెబ్బతినడంతో వైద్యులు చికిత్సను రెండు దశల్లో చేపట్టారు. మొదట డాక్టర్ రాజశేఖర్ మాడాలా నేతృత్వంలోని ప్లాస్టిక్ సర్జరీ బృందం మోకాలి చుట్టూ దెబ్బతిన్న కణజాలాన్ని శస్త్రచికిత్సకు అనుకూలంగా సిద్ధం చేసింది.అనంతరం డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ వీరగంధం నేతృత్వంలోని ఆర్థోపెడిక్స్ బృందం ప్రత్యేకమైన  హింజ్డ్ టోటల్ మోకాలి రీప్లేస్‌మెంట్ నిర్వహించింది.

మోకాలిని బలంగా పట్టి ఉంచే ఎముకలు, లిగమెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు సాధారణ మోకాలి మార్పిడి కంటే ఈ ప్రత్యేకమైన కృత్రిమ మోకాలిని ఉపయోగిస్తారు. అనేక పాత ఆపరేషన్ల వల్ల ఏర్పడిన మచ్చలు, ఎముకల నష్టం, మోకాలి ఆకృతిలో మార్పులు ఉన్నప్పటికీ శస్త్రచికిత్స విజయవంతమైంది.

ఆపరేషన్ తర్వాత మోకాలు సరైన స్థితికి రావడంతో పాటు కదలిక కూడా గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం రోగి నిలబడగలుగుతున్నాడు. మళ్లీ సాధారణంగా నడిచేలా చేయడానికి వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స కొనసాగుతోంది.