కామినేనిలో తలసేమియాకు చికిత్స
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): అత్యంత ప్రమాదకరమైన తలసేమియా వ్యాధికి హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని దవాఖానలో చికిత్స అందుబాటులోకి వచ్చింది. తల్లితండ్రుల నుంచి పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మంగళవారం దవాఖానలో జరిగిన కార్యక్రమంలో హెమ టాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సచిన్ జాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదకరమైన వ్యాధిపై అవగాహన, జన్యు కౌన్సెలింగ్, చికిత్సను కామినేనిలో అందిస్తామని తెలిపారు. తమ దవాఖానలో రక్త మార్పిడి, మూలుగ మార్పిడి సదుపాయం కూడా ఉందని చెప్పారు. జర్మనీ ఫౌండేషన్ సాయంతో తలసేమియాను గుర్తించే రూ.15 వేలు ఖర్చయ్యే హెచ్‌ఎల్‌ఏ పరీక్షను ఉచితంగా చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కామినేని వైద్యులు నర్సింహారావు, కంచన్ ఎస్ చన్నావర్, ఆర్వీ సౌజన్య, వై నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.






