13 June, 2026 | 12:43 AM

ట్రిలియనీర్ ఎలాన్ మస్క్!

13-06-2026 12:00 AM
  1. సరికొత్త చరిత్రకు సిద్ధమైన ప్రపంచ కుబేరుడు
  2. రికార్డు సృష్టించిన ‘స్పేస్ ఎక్స్’ ఐపీఓ
  3. ఏకంగా 75 బిలియన్ డాలర్లు సేకరణ 
  4.    1.77 ట్రిలియన్ డాలర్లకు పెరిగిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ
  5. ఈ భారీ విజయంతో మస్క్ నికర ఆస్తి 970 బిలియన్ డాలర్లు
  6. తన ఆధీనంలోనే 85 శాతం ఓటింగ్ పవర్
  7. ‘ఎస్‌పీసీఎక్స్’ టిక్కర్‌తో ట్రేడింగ్‌కు రెడీ

వాషింగ్టన్, జూన్ 12: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తన ఆధ్వర్యంలోని స్పేస్‌ఎక్స్ సంస్థ పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెట్టడం ద్వారా, ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఏకంగా 75 బిలియన్ డాలర్లను సేకరించి, అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచింది. దీంతో స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.

ఈ భారీ విజయంతో మస్క్ నికర ఆస్తి విలువ 970 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ట్రిలియన్ డాలర్ల క్లబ్ చేరుకోవడానికి మస్క్ కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కంపెనీ నాస్డాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ‘స్పేస్ ఎక్స్’ టిక్కర్‌తో ట్రేడింగ్ ప్రారంభించనుంది. ఒక్క ఐపీఓతోనే మస్క్ సంపదకు 275 బిలియన్ డాలర్ల సంపద పోగైంది. 

ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రపంచం అంతా పెరుగుతున్న అసమానతలు, ఆందోళనలు, ఇంధన సంక్షోభం మధ్య రికార్డు సృష్టించిన ‘స్పేస్‌ఎక్స్  ఐపీఓ’ మస్క్‌ను అపూర్వమైన సంపద శిఖరాలకు చేర్చింది. శుక్రవారం ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ వాల్ స్ట్రీట్‌లో అరంగేట్రం చేసినప్పుడు, ఈ వివాదాస్పద టెక్ దిగ్గజం ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా చరిత్ర పుటల్లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. గురువారం స్పేస్‌ఎక్స్ తన రికార్డు సృష్టించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను ప్రకటించడానికి ముందే, సుమారు 696 బిలియన్ల డాలర్ల సంపదతో మస్క్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటాన్ని అందుకున్నారు. కానీ ఈ రాకెట్ -కమ్ -ఏఐ కంపెనీలో ఆయనకున్న 42 శాతం వాటా మస్క్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది.

స్పేస్‌ఎక్స్ నాస్‌డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో అరంగేట్రం చేసినప్పుడు, ఒక్కో షేరును 135 డాలర్ల చొప్పున 555.6 మిలియన్ల షేర్లను విక్రయించి, 1.77 ట్రిలియన్ల డాలర్ల విలువతో ట్రేడింగ్‌ను ప్రారంభిస్తుంది. మస్క్ వాటా విలువ అంచనాలు 743 బిలియన్ల డాలర్ల నుంచి 866.5 బిలియన్ల డాలర్ల మధ్య ఉన్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, టెస్లాకు కూడా నాయకత్వం వహిస్తున్న మస్క్, శుక్రవారం మార్కెట్లు ముగిసేలోపు అధికారికంగా తన ట్రిలియనీర్ హోదాను పటిష్టం చేసుకుంటారు.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఒక ఫైలింగ్‌లో, అంతరిక్ష పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ, ఒక్కో షేరును 135 డాలర్ల చొప్పున 75 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు తెలిపింది.

షేర్ ధర గత వారం స్పేస్‌ఎక్స్ ఇచ్చిన అంచనాతో సరిపోలడంతో, ఆ సంస్థ ప్రారంభ స్టాక్ మార్కెట్ విలువ దాదాపు 1.8 ట్రిలియన్ల డాలర్లుగా ఉంటుందని అంచనా వేయబడింది. ఆ విలువతో, ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు.

1 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాలంటే.. మస్క్‌కు 2,740 ఏళ్లు.. 

1 ట్రిలియన్ డాలర్లు అనేది మానవాళి ఊహించలేనంత భారీ సంఖ్య. మస్క్ ప్రతిరోజూ 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా, 1 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి అతనికి 2,740 సంవత్సరాలు పడుతుందని యూకే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. 304 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడైన గూగుల్ సహ-వ్యవస్థాపకుడు లారీ పేజ్ కంటే, తన తోటివారితో పోల్చినప్పుడు మస్క్ మూడు రెట్లకు పైగా ధనవంతుడు అవుతారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

అంతేకాదు మస్క్ సార్వకాలిక అత్యంత సంపన్నులలో కూడా ఒకరిగా నిలుస్తారు. కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలలో తేడాల కారణంగా చరిత్రలో సంపదను పోల్చడం కష్టమైనప్పటికీ, పారిశ్రామిక యుగాన్ని ప్రారంభించిన 19వ శతాబ్దపు దిగ్గజాల కంటే మస్క్ యూఎస్ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ వాటాను సాధించే దిశగా పయనిస్తున్నారు. ఒక ట్రిలియనీర్‌గా, మస్క్ సంపద అమెరికా జీడీపీలో సుమారు 3 శాతానికి సమానంగా ఉంటుంన్నట్లు సమాచారం. ముందెన్నడూ చూడనంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కీర్తికెక్కనున్నారు.

మస్క్ ఆధీనంలోనే 85 శాతం ఓటింగ్ పవర్ 

స్పేస్‌ఎక్స్ ఐపీఓ తర్వాత కూడా మస్క్ తన పట్టును కోల్పోలేదు. డ్యూయల్ -క్లాస్ షేర్ స్ట్రక్చర్ ఉపయోగించి, 85 శాతం ఓటింగ్ పవర్ను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. 2002లో చిన్నగా ప్రారంభమైన స్పేస్‌ఎక్స్, నేడు అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఫాల్కన్ రాకెట్లు, స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలతో కంపెనీ భారీ లాభాలను పొందుతోంది.

ఇప్పుడు ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను అంగారకుడిపైకి మనుషులను పంపే స్టార్‌షిప్ ప్రాజెక్ట్ కోసం మస్క్ వెచ్చించనున్నారు. చంద్రుడిపై ఫ్యాక్టరీ నిర్మాణం, అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఈ నిధులతోనే చేపట్టనున్నారు. ఈ ఐపీఓ సక్సెస్ టెక్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సృష్టించబోతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఈ మూలధనం ఎంతో కీలకం కానుంది.