ప్రజా జీవితంలోనూ సైద్ధాంతిక వైరుధ్యాలా?
తెలుగునాట విప్లవోద్యమ చరిత్రలో గత ఏడెనిమిది నెలలుగా జరుగుతున్న పరిణామాలు కేవలం ముఖ్యాంశాలు కావు. అవి ఐదు దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాట రూపాంతరానికి సజీవ సాక్ష్యాలు. మావోయిస్టు అగ్రనేతలు సోను, దేవ్‌జీ, సంగ్రాం, ఆశన్న, చంద్రన్న వంటి వారు వందలాది మంది దళ సభ్యులతో కలిసి అజ్ఞాతాన్ని వీడి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం ఒక తాత్కాలిక రాజకీయ చలనం కాదు; ఇది ఒక సుదీర్ఘ పోరాట తాత్విక మలుపు. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ వామపక్ష నేత జీ రాములు రాసిన బహిరంగ లేఖను విశ్లేషిస్తూ మే 30, 2026న సిరికొండ రవీంద్రనాథ్ రాసిన ‘వామపక్షాల ఐక్యత అవశ్యం’ అనే వ్యాసం ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై ఒక చర్చను రేకెత్తించింది.
తుపాకీ పట్టిన చేతులు జనం మధ్యకు రావడమంటే విప్లవ ముగింపు కాదు, సరికొత్త ప్రజాస్వామ్య వ్యూహానికి ఆరంభమనే సత్యాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నా యి. ఏ సిద్ధాంతమైనా కాలంతో పాటు మారకపోతే అది జనం నుంచి వేరుపడిపోతుందనేది చారిత్రక సత్యం. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన గతితార్కిక భౌతికవాదం ప్రకారం సమాజంలోని భౌతిక పరిస్థితులు మారినప్పుడు పోరాట రూపాలూ మారాలి. 1970, 1980ల నాటి గ్రామీణ భూస్వామ్య నిర్బంధకాలపు తెలంగాణ వేరు, నేటి డిజిటల్ యుగపు ఆధునిక దోపిడీ కాలపు తెలంగాణ వేరు. యువత తమ మనుగడను కొత్త కోణంలో వెతుక్కుంటున్న ఈ కాలంలో సాయుధ పంథా కంటే చట్టబద్ధమైన ప్రజాపోరాటా లే కీలకం.
ఈ నేపథ్యంలోనే విప్లవ శక్తులు సాయుధ పంథాను మార్చుకొని ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టడం శుభపరిణామంగానే చూడాలి. అయితే జనం మధ్యకు వచ్చిన ఈ మహోద్యమ శక్తుల ముందు ఇప్పుడు ఒక పెద్ద తాత్విక వైరుధ్యం నిలిచింది. జీ రాములు తన లేఖలో ఎత్తిచూపినట్లు కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రాణాలనైనా త్యాగం చేయగలరు కానీ, తమ ‘ఇగో’ను మాత్రం ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు? నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, అపార్థాలు ఉన్నట్టు వస్తున్న వార్తలు శ్రేణులను, ప్రజలను ఆందోళన కు గురిచేస్తున్నాయి.
ద్వంద్వ పోరాటంలో అంతర్గత వైరుధ్యాలు ఎప్పుడూ శత్రువుకే లాభం చేకూరుస్తాయి. పరిపక్వత లేని విమర్శకులు, శత్రు శక్తులు ఈ విభేదాలను భూతద్దంలో చూపిస్తూ, వారి అసమాన త్యాగాలను మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తాయి, చూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తం గా అనేక ఉద్యమాలను పరిశీలిస్తే ‘ఈగో’లను పక్కనపెట్టి ప్రజల్లో నిలబడినప్పుడే ఉద్యమాలకు మనుగడ సాధ్యమని స్పష్టమవుతోంది. ఐక్యత లేని చోట త్యాగాలు ఎంత అనంతంగా ఉన్నా, ఫలితం మాత్రం శూన్యమే. ప్రజాజీవితంలోకి వచ్చిన మావోయిస్టుల ముందు సిద్ధాంతాలే కాదు, అనేక భౌతిక సవా ళ్లు ఉన్నాయి. జైళ్లలో ఉన్న వందలాది మంది సహచరుల విడుదల, చట్టపరమైన పోరాటం, దశాబ్దాల పాటు అడవికే పరిమితమైన వారికి పునరావాసం, ఆర్థిక, కుటుంబ రక్షణ కల్పించడం లాంటివెన్నో ఉన్నాయి. వారు కనీసం ఒకచోట సమావేశం కాలేని పరిస్థితి లేకపోలేదు.
ఈ ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆశన్న (తక్కెళ్లపల్లి వాసుదేవరావు) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదు. అందరూ ఒకే శక్తిగా నిలబడితేనే చట్టబద్ధమైన రక్షణ, ప్రజాదరణ లభిస్తాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ (తిప్పిరి తిరుపతి) అన్నట్లు, అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ‘మావోయిస్టు’ పేరుతోనే ఎన్నికల బరిలోకి వెళ్లడం లేదా ఒక విస్తృతమైన ఉమ్మడి వేదికను నిర్మించడం సమాజంలో వారి ఉనికిని శాసించేలా చేస్తుంది.
ఈ చారిత్రక తరుణంలో, రాములు లేఖపై స్పందిస్తూ ప్రధాన వామపక్షాలైన సీపీఐ, సీపీఎం నేతలు గుజ్జుల ఈశ్వరయ్య, జగ్గులు జాన్ వెస్లీలు ‘మావోయిస్టులతో కలిసి పనిచేయడానికి సిద్ధం’ అని ప్రకటించడం ఒక సానుకూల పరిణామం. బూర్జువా పార్టీల వైపు వెళ్లకుండా, దశాబ్దాల విప్లవ త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే వామపక్షాల ఐక్యత ఏకైక మార్గం. ఇప్పటికైనా వామపక్ష నాయకత్వాలు విభేదాలను పక్కనపెట్టి ఒక ఉమ్మడి ప్రణాళికతోనైనా ముందుకురావాలి. భారత రాజ్యాంగాన్నే మార్చాలనే శక్తులు, హక్కులను కాలరాసే ధోరణులు పొంచి ఉన్న ఈ తరుణంలో విభేదాలను వీడి ఎర్రజెండాలన్నీ ఒకే తాటిపైకి వస్తేనే, దేశ రాజకీయాల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవిస్తుంది.






