29-05-2025 12:00:00 AM
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజులపాటు కాల్పుల విరమణకు జరిగిన ప్రయత్నాల్లో ఫలితం మృగ్యమైంది. రష్యా తన వద్ద ఉన్న అత్యాధునిక సైనికాయుధాలు, డ్రోన్లతో ఉక్రెయిన్ ఈశాన్య నగరాలను ఛిన్నాభిన్నం చేయడంతో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా, ఐరోపా దేశాలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. గతవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు ఫోన్లో సంభాషించిన తర్వాత కూడా బేషరతుగా కాల్పుల విరమణకు రష్యా ససేమిరా అంది.
యుద్ధం ముగియాలన్నా, కాల్పుల విరమణ జరగాలన్నా ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాలు సైనిక సాయాన్ని ఆపాలని పుతిన్ పట్టుబడుతున్నారు. యుద్ధం పరిసమాప్తి మాట ఎలా వున్నా, కనీసం కాల్పుల విరమణకైనా పుతిన్ అంగీకరించక పోవడం, ఉక్రెయిన్‌పై మరోసారి పెద్ద ఎత్తున సైనిక దాడికి దిగడం ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. పుతిన్ ‘నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు’ అని ట్రంప్ తన కోపాన్ని ప్రదర్శించారు.
మిగతా ప్రపంచ దేశాలతో ఒక బాస్‌లా వ్యవహరిస్తున్న ట్రంప్ సరళికి రష్యా విషయంలో తూట్లు పడింది. ‘రష్యాకు జరగబోయేదంతా చెడు’ అని ట్రంప్ చెబుతున్న మాటలకు రష్యా పెద్దగా విలువ నివ్వడం లేదు. ‘చెడు అంటూ జరిగితే, అది మూడో ప్రపంచ యుద్ధం రావడమే. దీనిని ట్రంప్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని పుతిన్ సన్నిహితుడు దిమిత్రి మెద్వెదేవ్ అంటున్నారు.
ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతూ పుతిన్ ‘పిచ్చితనం’ చూపిస్తున్నాడని, ఉక్రెయిన్‌లో కొంత భాగం కాదు, అంతా కావాలని పుతిన్ భావిస్తున్నాడని ట్రంప్ అనడంతో ఇక ఉక్రెయిన్ అంశం ఎంతమాత్రం పుతిన్ చేతుల్లో లేదని ఐరోపా నేతలకు అర్థమైంది. 2017లో ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు పుతిన్‌ను తన మిత్రునిగానే చెప్పుకున్నారు. కానీ, ఎప్పటికప్పుడు మాట మార్చే ట్రంప్పట్ల పుతిన్ మౌనంగా ఉన్నారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యావైపునే ఫలితం ఉంటుందని, ఉండాలని బలంగా నమ్ముతున్న పుతిన్ అమెరికా అధ్యక్షుని మాట కాదు కదా, ఎవరి మాట చెవి నెక్కించుకొనేట్టు లేరు. తన ‘స్థాయి’కి గౌరవం ఇవ్వాలన్న ట్రంప్ ధోరణిని పుతిన్ పెద్దగా ఖాతరు చేస్తున్న దాఖలాలు కూడా లేవు. భౌగోళికంగా రష్యా తమకు ఎప్పుడూ శత్రువేనని ట్రంప్, రష్యా ఎప్పటికీ అమెరికాకు పెద్ద సమస్యేనని ట్రంప్ అప్పుడప్పుడూ చెప్పడాన్ని కూడా గమనించాలి.
వైట్‌హౌస్‌కు చర్చలకు పిలిచి, నయాన్నో భయాన్నో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినిస్కీని ఆ దేశంతో ఖనిజాల ఒప్పందానికి ఒప్పించడమంత తేలిక కాదు పుతిన్‌తో వ్యవహరించడమనేది అని ట్రంప్ గ్రహించినట్టున్నారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ వ్యూహాలు అర్థమయినా, కానట్లు పెద్దరికం తెచ్చి పెట్టుకోవడం వల్ల ట్రంప్‌కు భంగపాటే మిగిలింది. ఇది ట్రంప్‌కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నది.
రష్యాపై అదనంగా ఆర్థికంగా ఆంక్షలు విధించే అంశాన్ని అమెరికా ప్రస్తుతానికి పరిగణించవచ్చు. రష్యాపై మరిన్ని ఆంక్షలకు ఐరోపా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అదే జరిగితే ఇక పుతిన్‌తో సంప్రదింపులు జరిపేందుకు అమెరికాకు ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుంది. ‘ఉక్రెయిన్ విషయం మాకు వదిలివేయండి, మిగతా విషయాల్లో సంబంధాలు బలోపేతం చేసుకుందాం’ అనే తీరులో అమెరికాతో రష్యా వ్యవహరిస్తున్నది.