28-05-2025 02:05:52 AM
అత్యధిక జనాభా, అనేక విభిన్న వర్గాలు, కులమతాలు, ప్రాంతా ల మధ్య ఎన్నో సంక్లిష్టతలతో కూడిన అతిపెద్ద, సువిశాలమైన భారతీయ సమాజం లో ప్రజాప్రభుత్వాలకు సంక్షేమ ఫలాల పంపకం ఒక పెద్ద కసరత్తు వంటి మహా సమస్య. ఏ పథకానికి ఎవరు అర్హులు, ఎవ రు అనర్హులో, ఎవరి ఆకలి తీరింది, కొత్తగా ఎవరు ఆకలితో ఉన్నారు, పేదరికం పేరు చెప్పి నకిలీ సర్టిఫికెట్లతో ఎవరు దోపిడీకి పాల్పడుతున్నారు?
వంటివన్నీ నిర్ధారించడం నిజంగా అంత తేలికైన వ్యవహారం కాదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా పాలకులకు ఇది నిరంతరం తీవ్ర సమస్యే. అందుకే, చట్టసభలు పేదవారి కోసం కేటాయించే ఒక్క రూపాయి మొత్తం వాళ్లను చేరేసరికి ఒక్క పైసా స్థా యికి పడి పోతున్నదన్నది వాస్తవం. భారతదేశంలో పేదవారు సహాయం పొందేం దుకు అర్హులో కాదో నిర్ణయించుకునే వేర్వే రు వ్యక్తులకు, వేర్వేరు పత్రాలతో, వేర్వేరు కార్యాలయాల్లో, దానిని అనేకసార్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఒక్క తప్పటడుగు వేసినా వారు మళ్ళీ మొదటికి వస్తారు. భారతదేశ సంక్షేమ ఫలాల పంపిణీ కోసం ఏర్పాటైన వ్యవస్థల నిర్మాణం వెనుక ఉన్న అసలు కథ ఇదే. 2023- ఆర్థిక సంవత్సరంలో రూ. 5.4 లక్షల కోట్లు ఖర్చు చేయడంతో మన సంక్షేమ దేశం దృఢంగా, విశాలంగా, కాగితంపైనా ఉదారంగా ఉంటుందన్న సంగతి రుజువైంది. కానీ, ఇదే సమయంలో ఆల స్యం చేసే, డిమాండ్ చేసే లేదా తిరస్కరిం చే అధికారుల రక్షణలో ఆర్థికంగా వెనుకబడిన జనాభాకు ఇదొక విడదీయ లేని చిక్కుముడిగానూ మిగిలింది.
2023 నాటికి, పాత జనాభా డేటా మేరకు సుమారు 4.5 కోట్లమంది అర్హులైన వ్యక్తులు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి మినహాయింపుకు లోనయ్యారు. బీహార్ లో సుమారు 12 లక్షలకు పైగా వృద్ధ దరఖాస్తుదారులు పెన్షన్ల కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారు. ‘ఇండియా మైగ్రేషన్ నౌ’ అధ్యయనం మేరకు నివాస ఆధారిత నియమాల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్లకు పైగా వలస కార్మికులు రేషన్ కార్డులు లేదా ఆయుష్మాన్ భారత్ వంటి హక్కులను పొందేం దుకు ఇబ్బంది పడుతున్నారు.
‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ 2022’ సర్వేలో వెలుగుచూసిన ట్రాన్స్‌జెండర్‌లలో 2% మంది మాత్రమే మూడు రకాల కీలక పత్రాలను కలిగి ఉన్నారు. అవి: ఆధార్, రేషన్ కార్డ్, కుల/ఆదాయ ధృవీకరణ పత్రాలు. కాబట్టి, రేషన్‌కార్డ్ లేని దళిత వితంతువు అయినా, శాశ్వత చిరునామా లేని వలసదారు అయినా లేదా సర్టిఫికెట్లు లేని యువ ట్రాన్స్‌పర్సన్ అయినా, మన దేశంలోని చట్టాల ప్రకారం ఎప్పటికీ సంక్షేమ ఫలాలను పొందలేరు.
అనవసర మినహాయింపులు
భారతదేశంలో ప్రజాప్రభుత్వాలు ‘లక్ష్యంగా పెట్టుకున్న సంక్షేమం’ తరచుగా అనేక రకాల మినహాయింపులకు లోనవుతుండటమే ప్రధాన సమస్య. ఆయా పథకాల ప్రయోజనాలు పూర్తి అర్హులకు చేరేలా చూసుకోవడం ప్రధాన ఉద్దేశ్యం అయినప్పటికీ వాస్తవానికి, సరైన మంజూరులు ఏవీ లేకుండా తిరస్కరణను ఎదు ర్కొనే వారెందరో. ఈ క్రమంలో ప్రజలకు అంతులేని ప్రభుత్వ సంబంధ కాగితపు పనులు మాత్రం చేయక తప్పడం లేదు.
ఒక రకంగా చూస్తే ఈ సంక్షేమ వ్యవస్థ పేదలకు సహాయకారి అని చెబుతూనే మరోవైపు అణగారిన వారిని అకారణంగా శిక్షిస్తున్నదని చెప్పాలి. నియమ నిబంధనల మేరకు అన్ని పత్రాలూ సమర్పించి, అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, చేయవలసిన విధి విధానాలన్నీ పూర్తి చేసిన వారికి వారి సమయం, అక్షరాస్యత, ప్రాప్యతల మేరకు సంక్షేమ పథకాల ఫలా లు అందుతాయి. ఇవేవీ సాధించని వారికి నిరాశ తప్పదు. మరోవైపు అవినీతి, కులతత్వాల పాత్ర ఉండనే ఉంటుంది.
ఈ తరుణంలో ఆదర్శవంతమైన సార్వత్రిక విధానాలు ఆచరణలోకి రావాలి. అ ప్పుడు మాత్రమే సంక్షేమ ఫలితాలు పేదవారికి పూర్తిస్థాయిలో అందుతాయని న మ్మవచ్చు. సార్వత్రిక సంక్షేమ పథకాలు సరళమైనవేకాక స్వయంచాలకంగా, అ వాంఛనీయ విచక్షణలకు ఆస్కారం లేకుం డా ఉంటాయి. కాబట్టి, అవి అందరికీ సమాన ప్రాతిపదికన లభిస్తాయి. ఉదా॥ కు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి బిడ్డకు వేడి భోజనం అందుతుంది.
ఈ ప్రయోజనం పక్షపాతం లేకుండా లభిస్తుంది. తమిళనా డు మధ్యాహ్న భోజన పథకం, ఛత్తీస్‌గఢ్ పీడీఎస్ వంటివి ఇందుకు ప్రధాన ఉదాహరణలు. అలాగే, ఢిల్లీలోని ఉచిత విద్యు త్ పథకం కూడా ఈ సూత్రంతోనే ఉంది. 200 యూనిట్ల వరకు 100% సబ్సిడీని, 400 యూనిట్ల వరకు 50% సబ్సిడీని అప్పట్లో ప్రభుత్వం అందించింది. ఇది 2024 నాటికి 36 లక్షలకు పైగా గృహాలకు ప్రయోజనం చేకూర్చింది.
ఈ రకమై న పథకాలు స్వయంచాలకంగా, నిర్వచించిన పరిమితుల్లో ఉంచడం వల్ల ఎలాంటి మినహాయింపులకు, లీకేజీలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటాయి. 2019లో ప్రారంభమైన ఢిల్లీ మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా ఇదే ఫలితాన్నిచ్చింది. ఆదాయం, కుల తనిఖీ లు లేవు. కేవలం పింక్ టికెట్. లక్షలాది మంది మహిళలకు విద్య, పని, స్థలాలు కలిగిన వారందరికీ ప్రయోజనకరమైంది.
అంత కఠిన నిబంధనలు అవసరమా?
కానీ, ఇప్పుడు పద్ధతి మారుతోంది. బీజేపీ ప్రభుత్వం పింక్ టికెట్‌ను వలస కా ర్మికులు, విద్యార్థులు, నమోదు కాని వారి ని మినహాయింపజేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నివాస రుజువు అవసరమ య్యే జీవితకాల ఆధారంతో దానిని భర్తీ చేయాలని యోచిస్తోంది. ఇది బ్యూరోక్రాటిక్ అడ్డంకులను సృష్టించే అవకాశం ఉం టుంది. అదే విధంగా ఆయుష్మాన్ భారత్, దాని లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పటికీ, కఠిన అర్హతా నిబంధనలవల్ల చాలామందికి, ముఖ్యంగా అవసరార్థులను తరచుగా పథ కం మినహాయించేస్తున్నది.
ప్రాథమిక ఆస్తులను కలిగి ఉన్నందుకు లేదా తక్కువ ఆదాయాన్ని సంపాదించినందుకు ప్రభుత్వాల నిబంధనలు, పద్ధతులు అనేక కు టుంబాల వారిని అనర్హులుగా చేస్తున్నా యి. ఫలితంగా మురికివాడల నివాసితు లు, రిక్షా కార్మికులు, అనధికారిక కార్మికులు ఎందరో అసమానంగా మినహా యింపు బారిన పడుతున్నారు.
ఢిల్లీలోని సంపన్నులు ఎప్పుడూ ఉచిత బస్సు ప్రయాణం కోసం క్యూలో నిలబడరు. వారు తమ విద్యుత్ బిల్లు గురించి ఆందోళన చెందరు. లేదా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపరు. అదే సార్వత్రిక సంక్షేమంగా పథకాలు ఉన్నప్పుడు ప్రయోజనాలు ఇలా ఉండవు. ఎలాంటి మినహాయింపులకూ తావు లేకుండా అందరికీ ఫలితాలు వర్తిస్తాయి.
కులం, వర్గం, శతాబ్దాల వ్యవస్థాగత నిర్లక్ష్యం ద్వారా ఏర్పడిన భారతదేశంలో, బాగా రూపొందించిన సార్వత్రిక సంక్షేమ విధానాలు అవసరం. సార్వత్రిక పథకాలు అంటే అందరినీ (డబ్బున్న వారిని, లేనివారిని) ఒకేలా చూసుకోవడం కాదు. నిజమై న పేదవారెవరూ ఏ కారణంగానైనా వెనుకబడి ఉండరని అర్థం. నిరంతరం తమ పేదరికాన్ని నిరూపించుకోవడానికి వారిని బలవంతం చేసే వ్యవస్థ దీనిద్వారా తొలగిపోతుంది.
అవినీతిని నిఘాద్వారా కాక అ ధికార అడ్డంకులను తొలగించడం ద్వారా తగ్గిస్తాయి. కాబట్టి, ఏసీ గదులలో సార్వత్రిక పథకాల ఆర్థిక నష్టాల గురించి చర్చిం చే ముందు విధాన నిర్ణేతలు నిజమైన పేదవారి స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఉదా॥కు గ్రామీణ బీహార్‌లోని రేషన్ దుకాణాల్ని లేదా పట్టణ రాజస్థాన్‌లోని పెన్షన్ క్యూలను సందర్శించడం ద్వారా అధికారులు వాస్తవాలు గ్రహించగలరు. పేద మహిళలు ఎన్ని రకాల ఫారాలను నింపారో, ఎన్నిసార్లు వారిని అధికారులు నిర్దంద్వంగా తిరస్కరించారో, ఎంత తరచుగా లంచం అవసరమైందో అప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతారు.
సంక్షేమ పథకాల ఫలాలను నిజమైన లబ్ధిదారులకు బేషరతుగా, అనవసర, అకారణ అపసోపాలకు వారిని గురిచేయకుం డా అందించవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వాలది. ‘ప్రపంచ బ్యాంకు’ అభిప్రాయం ప్రకారమే ‘పేదలను లక్ష్యంగా చేసుకున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్: టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) అత్యధిక నిబంధనలు, మినహాయింపుల లోపాలతో కూడి ఉండటం తగదు.
అదే విధం గా, సామాజిక పెన్షన్ కార్యక్రమాలలో సంక్లిష్టమైన మాన్యువల్ ధృవీకరణ ప్రక్రియలు ఉంటాయి. ఇవి పరిపాలనా ఖర్చులను పెంచడమే కాక అనేకమంది అర్హత కలిగిన వృద్ధులను కూడా మినహాయించేస్తున్నాయి. వృద్ధుల బయోమెట్రిక్స్ సరిపోలేక పోవడంతో వారికి పెన్షన్ నిరాకరణకు గురైన లెక్కలేనన్ని కథనాలను మనం చదువుతాం.
గడీల ఛత్రపతి