26 June, 2026 | 2:16 AM

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ ధర్నా

26-06-2026 01:22 AM

నస్పూర్, జూన్ 25: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు మాట్లాడుతూ ఎస్టిఎఫ్‌ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)పిలుపులో భాగంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శించామన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించాలని, ఎన్‌ఈపీ 2020ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతను ఆపివేయలని, అవసరం ఉన్న చోట నూతన పాఠశాలలను తెరవాలని, విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వీ కిరణ్ కుమార్, కోశాధికారి బి కిరణ్, కార్యదర్శి బి దేవదాస్, జిల్లా కమిటీ సభ్యులు యూ తిరుపతి, భారీక్ రావు, తిరుపతి, శ్రీనివాసరెడ్డి, రాములు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.