24 April, 2026 | 1:48 AM

హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

24-04-2026 12:00 AM

గద్వాల టౌన్ ఏప్రిల్ 23 : గద్వాల పట్టణంలోని స్వాగత్ లాడ్జి సమీపంలో ఈ నెల 12న చోటుచేసుకున్న గొల్ల వీరేంద్ర హత్య కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు గొల్ల వీరేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందినవాడు.

జీవనోపాధి కోసం గద్వాలకు వచ్చి ఖాళీ మద్యం సీసాలు,ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగించేవాడు.ఇదే వృత్తిలో ఉన్న మహబూబ్నగర్ కుప్పగిరి శ్రీనివాసులు మరియు కడప జిల్లా సిద్దయ్య తో అతనికి పరిచయం ఏర్పడింది.చెత్త సేకరణ ద్వారా వచ్చే ఆదాయం విషయంలో వీరి మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటుండేవి.ఈ క్రమంలో వీరేంద్రను హత్య చేయాలని శ్రీనివాసులు,సిద్దయ్యలు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 12న వీరేంద్రను మద్యం సేవించేందుకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొడవకు దిగారు.మొదట చేతులతో దాడి చేసి కింద పడేసిన అనంతరం అక్కడే ఉన్న పెద్ద రాయితో తలపై ముఖంపై దారుణంగా కొట్టడంతో వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుల ప్రమేయాన్ని గుర్తించి కుప్పగిరి శ్రీనివాసులు,సిద్దయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.