13 July, 2026 | 10:34 AM

నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్

28-06-2024 01:14 AM

పాట్నాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ

పాట్నా, జూన్ 27 : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ యూజీ పేపర్ లీక్ కేసుపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి బీహార్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. నిందితులు మనీష్ ప్రకాశ్, అశుతోష్‌లను పాట్నాలో అరెస్ట్ చేసింది. లీకైన పేపర్‌ను పొందిన విద్యార్థులను మనీశ్ తన కారులోనే తరలించినట్లు సీబీఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 24 మందికి అతడే రూమ్ కూడా బుక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. మరో నిందితుడు అశుతోష్ తన ఇంట్లోనే నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది.

దీంతో పాటు బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఇక నీట్ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ, యూజీసీ నెట్ పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. నీట్, నెట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో లీకేజీలు బయటపడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలు, అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.