12-11-2025 10:32:11 PM
- 26 బైక్‌లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట (విజయక్రాంతి): ఖరీదైన బైకులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. సూర్యాపేట టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. అదే సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి తనిఖీ చేశారన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్క్ సిస్టం ద్వారా అతడి వేలిముద్రలు తనిఖీ చేసి అతడిపై సుమారు 50 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా చిలుకూరు మండలం కటకొమ్ముగూడెం గ్రామానికి చెందిన వేమూరి కృష్ణగా వివరాలు చెప్పాడన్నారు. ఇతను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెం గ్రామానికి చెందిన రేఖల శివకుమార్ తో కలిసి సూర్యాపేట పట్టణం, ఖమ్మం, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌ని పలు ప్రాంతాల్లో ఖరీదైన బైక్‌లను చోరీ చేసినట్లు తేలిందన్నారు. వీరి నుంచి 26 బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.