16 May, 2026 | 2:10 AM

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

16-05-2026 12:00 AM
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య
  2. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ 

ముషీరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఎన్నికల వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ లేఖ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రావడానికి నిరుద్యోగ సమస్య ప్రధాన కారణమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసినందుకే వారి ఆగ్రహానికి గురై ఓటమి పాలయిందన్నారు.

ఈ మేరకు శుక్రవారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగులను నమ్మించారని మండిపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 69 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలలో భారీ ఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

రిటైర్మెంట్ వలన ప్రమోషన్ వల్ల ఏర్పడిన ఖాళీలు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తక్షణమే ఖాళీగా ఉన్న 30వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ ఈ నెల 20న ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు, ఆయా సంఘాలు మద్దతు తెలపాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు జీ అనంతయ్య, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ కుమార్, నిఖిల్ పటేల్ తదితరులు ఉన్నారు.