16 May, 2026 | 2:12 AM

ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులకు కేంద్రం కృషి

16-05-2026 12:00 AM

వైద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి

అంబర్‌పేట, మే15 (విజయక్రాంతి): నగరంలో ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్‌అంబర్‌పేట యూపీహెచ్‌సీ సెంటర్‌కు వైద్య పరికరాల పంపిణీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌లో పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధార పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు.

రూ. 1300 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. బాగ్ అంబర్‌పేట్ యూపీహెచ్‌సీ సెంటర్‌కు రూ.9 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు అందజేశామని చెప్పారు. బస్తీ దవాఖానాలను వెల్‌నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేసి, డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ప్రపంచపరిస్థితులు, యుద్ధాల ప్రభావంతో పెట్రోల్ ధరలు పెరిగాయని, అయినా ప్రజలపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఉచిత బియ్యం, రహదారులు, ఆసుపత్రులు, రైతు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రభుత్వ ఆదాయం అవసరమన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పెట్రోల్ ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు,  సిబ్బంది, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.