25 February, 2026 | 2:20 AM

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

25-02-2026 12:51 AM

కోఠి ఏటీఎం కాల్పుల కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి):హైదరాబాద్ కోఠిలోని ఎస్బీ ఐ ఏటీఎం వద్ద తుపాకీతో కాల్పులు జరిపి, సినీ ఫక్కీలో రూ. 6 లక్షలు దోచుకెళ్లిన సంచలన కేసును నగర పోలీసులు ఎట్టకేలకు ఛేదిం చారు. నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉదయం వేళల్లో డబ్బు డిపాజిట్ చేసేవారిపై రెక్కీ నిర్వహించి, ఉత్తరప్రదేశ్ నుంచి కిరాయి ముఠాను పిలిపించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్స్, సుల్తాన్ బజార్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి సోమవారం ఇద్దరు కరుడు గట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక దేశవాళీ తుపాకీ, రెండు మ్యాగజైన్లు, ఏకంగా 35 సజీవ తూటా లు ,రూ. 2,38,000 నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల జనవరి 31న ఉదయం కోఠిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి చొరబడిన దుండగులు, డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని తుపాకీతో బెదిరించారు.

బాధితుడు ప్రతిఘటిం చడంతో దుండగుల్లో ఒకరైన ఫుర్కాన్ అహ్మ ద్ తుపాకీతో మొదట నేలకేసి, ఆ తర్వాత బాధితుడి కాలుపై కాల్పులు జరిపాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న రూ. 6 లక్షల నగ దు సంచిని, ద్విచక్ర వాహనాన్ని లాక్కొని పరారయ్యారు. నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. ప్రధాన సూత్రధారి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ తయ్యబ్ త్యాగి (30) అని గుర్తించారు.

ఇతను బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి బాలాపూర్ షాహీన్ నగర్‌లో ఉంటూ ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున రైడ్లకు వెళ్లేటప్పుడు అబిడ్స్, కోఠి, నాంపల్లి ప్రాంతాల్లోని ఏటీఎంలలో భారీగా నగదు డిపాజిట్ చేసేవారిని గమనించేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో యూపీలోని తన మామ నౌషాద్, కజిన్ డానిష్ త్యాగిలతో కలిసి దోపిడీకి ప్లాన్ వేశాడు.

వారి సూచన మేరకు కరుడుగట్టిన నేరస్తులైన ఫుర్కాన్ అహ్మద్ (36), అబిడ్, ఫహీమ్ అహ్మద్‌ల సాయంతో హైదరాబాద్ రప్పించాడు. ఘటన జరిగిన రోజు ఉదయం తయ్యబ్ త్యాగి, అబిడ్ కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించగా, ఫుర్కాన్, ఫహీమ్ మాత్రం కోఠి ఏటీఎం వద్ద కాపుకాశారు. టార్గెట్ చేసిన వ్యక్తి రాగానే లోపలికి వెళ్లి కాల్పులు జరిపి డబ్బు దోచుకున్నారు.

అనంతరం అందరూ షాహీన్ నగర్ వెళ్లి తయ్యబ్ మామ మహ్మద్ మత్లూబ్ సమక్షంలో డబ్బును పంచుకుని సొంతూళ్లకు చెక్కేశారు. విశ్వసనీయ సమాచారంతో డీసీపీ టాస్క్‌ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి.

సోమవారం చాంద్రాయణగుట్ట షాహీన్ నగర్ ప్రాంతంలో తచ్చాడుతున్న ఫుర్కాన్ అహ్మద్, మహ్మద్ తయ్యబ్ త్యాగిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో డీసీపీలు గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కె.శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవే క్షణలో ఇన్‌స్పెక్టర్లు కె. చంద్రశేఖర్, ఎన్. రంజి త్ కుమార్ గౌడ్, జి. నరేష్, ఎస్సైలు పి. జ్ఞానదీప్, శ్రీకాంత్ బృందం ఉన్నది.