14న ఇల్లందులో రెండు రాష్ట్రాల స్థాయి నృత్య పోటీలు
ఖమ్మం, జూన్ 4 (విజయక్రాంతి): కీర్తిశేషులు బాల, సాయి జ్ఞాపకార్థం వెంకట్ డ్యాన్స్ అకాడమీ, వీబీసీసీ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14న ఇల్లందులోని సీఈఆర్ క్లబ్లో రెండు రాష్ట్రాల స్థాయి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నృత్య పోటీలు నిర్వహించనున్నారు.
ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ పోటీల గోడపత్రిక (బ్రోచర్)ను క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలు యువతలో క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులకు ఈ పోటీలు ఒక మంచి వేదికని కొనియాడారు.
ఈ నెల 14న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలలో వెస్ట్రన్, ఫోక్, క్లాసికల్ విభాగాల్లో జూనియర్, సీనియర్ గ్రూప్స్తో పాటు సోలో, డ్యూయెట్ ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీదారులు నృత్యం చేయాల్సిన పాటలను పెన్ డ్రైవ్ లేదా మొబైల్లో తీసుకురావాలని, క్లాసికల్ నృత్యానికి 5 నిమిషాలు, ఫోక్, వెస్ట్రన్కు 4 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు తెలిపారు.
ప్రతి విభాగంలో కనీసం 10 ఎంట్రీలు ఉంటేనే బహుమతులు అందజేస్తామని, విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పోటీల్లో పాల్గొనే వారందరికీ ప్రశంసా పత్రంతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తామని, విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోటీల రిజిస్ట్రేషన్ , ఇతర వివరాలకు కడారి వెంకటేష్ (8374579497, 7989163958), సాయి మాస్టర్ (9030099139) నెంబర్లలో సంప్రదించాలని కోరారు.






