నియోజకవర్గ అభివృద్ధిపై ఎంఎంసీ కమిషనర్‌తో సమావేశమైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 4 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి వినతిపత్రాలు అందజేశారు. అల్వాల్ గ్రామ కంఠం స్థలంలో 11 గుంటల భూమిని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించే విషయమై ఎమ్మార్వో డిప్యూటీ కమిషనర్కు పంపిన లేఖలు, అలాగే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదం పొందిన తీర్మాన పత్రాన్ని కమిషనర్కు అందజేశారు.
ఫైర్ స్టేష్ప నెలకొన్న అపోహలను తొలగించి, అల్వాల్ ప్రాంత ప్రజల భద్రత దృష్ట్యా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, నియోజకవర్గంలోని పార్కులను ఆధునీకరించి ఓపెన్ జిమ్ల ఏర్పాటు, బండ చెరువు అభివృద్ధి, చెరువులపై ఉన్న కోర్టు కేసుల పరిష్కారంతో అభివృద్ధి పనులు చేపట్టడం, వివిధ కాలనీల్లో అవసరమైన బాక్స్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం, ఆర్కే హెచ్ కాలనీలో పార్కు స్థలాన్ని పరిరక్షించే అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అధికారులు, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు రాము యాదవ్, ప్రభాకర్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి,సంతోష్ గుప్తా, మల్లేష్ యాదవ్, హనుమాన్ చారి, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.






