పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు
దమ్మపేట, జూలై 17(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కార్మికులు, వేడి నీళ్లు ఒంటిపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఎంఈఈ (మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్) విభాగంలో రాత్రి 11 గంటల సమయంలో వాటర్ లైన్ జామ్ అయిందనే సమాచారంతో ఆపరేషనల్ మెయింటెనెన్స్ సిబ్బంది శివరాం, గణేష్ అక్కడకు చేరుకుని పైపు లైను పరిశీలిస్తున్న క్రమంలో పైపునకు అమర్చి ఉన్న వ్యూ గ్లాస్ పేలిపోయింది. ఒక్కసారిగా అందులో ఉన్న తీవ్రమైన వేడి నీళ్లు ఇద్దరు కార్మికుల పై పడటంతో చర్మం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు స్పందించి తన సిబ్బందితో కలిసి, క్షతగాత్రులను సత్తుపల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు.






