1 July, 2026 | 8:18 AM

2 రోజుల్లో 2 వేలు

25-05-2024 01:58 AM

హైదరాబాద్, మే 24: గత వారంలో ఎంతో వేగంగా పెరిగిన పసిడి ధర ఈ వారం అంతేవేగంతో దిగివచ్చి ఆభరణాల కొనుగోలుదార్లకు కొంత ఊరటనిచ్చింది. శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో  24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా మరో  రూ.980 మేర తగ్గి రూ.72,440 వద్ద నిలిచింది. గురువారం రూ.1,090 మేర ధర దిగిన సంగతి తెలిసిందే. ఈ గురు, శుక్రవారాలు రెండు రోజుల్లో  తులం పుత్తడి  భారీగా రూ.2,070 చౌక అయ్యింది. గత వారాంతంలో పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచి ఇప్పటివరకూ  రూ.2,700 పైగా తగ్గింది. శుక్రవారం 22 క్యారట్ల పుత్తడి తులం ధర మరో రూ.900 తగ్గి రూ.66,400 స్థాయికి చేరింది. ఈ ఆభరణాల బంగారం ధర వరుస రెండు రోజుల్లో రూ.1,900 పడిపోయింది. ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో భారత్‌లోనూ ఆ రెండు లోహాల ధరలు కొత్త రికార్డుస్థాయి నుంచి దిగివచ్చాయి.  ఈ గురు, శుక్రవారాల్లో బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ, బంగారం ధర మే 1 నాటి ధరతో పోలిస్తే రూ.1,000 వరకూ పెరిగే ఉన్నది. 

కొనుగోలుకు అవకాశం

ఈ వారంలో బంగారం ధర బాగా బలహీనపడిందని, రికార్డు గరిష్ఠాల నుంచి రూ. 2,700 వరకూ పడిపోయిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు. యూఎస్ ఫెడ్ త్వరితంగా వడ్డీ రేట్లను తగ్గించబోదన్న అంచనాలే ఇందుకు కారణమన్నారు. అయితే బంగారం ధర ప్రస్తుతం సర్దుబాటుకు లోనవుతున్నప్పటికీ, ట్రెండ్ పటిష్ఠంగానే ఉన్నదన్నారు. అందుచేత ఈ వారం క్షీణతను కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని త్రివేది సూచించారు.

మరో రూ.500 తగ్గిన  వెండి

పసిడికంటే వెండి ధర తక్కువగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ. 96,500 వద్ద నిలిచింది. క్రితం రోజు ఒక్కసారిగా పతనమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఈ వైట్ మెటల్ ధర రూ.1,01,000 వద్ద రికార్డుస్థాయిని నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర ఫ్లాట్‌గా 30.80  డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లో  ఇతర కమోడిటీలతో పాటు బంగారం, వెండి ధరలు సైతం బాగా తగ్గినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్టు గణాంకాలు వెలువడుతున్నాయని, దీంతో డాలర్ ఇండెక్స్, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నాయని, ఈ రెండూ పెరగడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని గాంధి వివరించారు. ఇటీవల 2,440 డాలర్ల స్థాయికి చేరిన ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి 2,340 డాలర్ల వద్దకు పతనమయ్యింది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర  రూ.71,500 స్థాయికి తగ్గింది.